
కోల్‌కతా: ఐపీఎల్–18లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చావో రేవో మ్యాచ్‌లకు రెడీ అయ్యింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల్లో బుధవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం 11 పాయింట్లతో నైట్‌రైడర్స్ వరుసగా మూడు నెగ్గితే 17 పాయింట్లకు చేరుకుంటుంది. అప్పుడు నెట్ రన్‌రేట్, ఇతర సమీకరణాలపై తక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఢిల్లీ, రాజస్తాన్‌తో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా గెలవడం కేకేఆర్‌లో కాన్ఫిడెన్స్ పెంచింది. దాన్ని అలాగే కంటిన్యూ చేయాలని భావిస్తున్న కోల్‌కతా బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టింది. రెహమనుల్లా గుర్బాజ్ మెరుపు ఆరంభాన్నిస్తున్నా, నరైన్ భారీ హిట్టింగ్‌లో వెనకబడిపోతున్నాడు. కెప్టెన్ రహానే, వెంకటేశ్ అయ్యర్ ఫామ్‌లోకి రావాల్సి ఉంది.
రఘువంశీ, రసెల్ బ్యాట్లు ఝుళిపిస్తుండటం కేకేఆర్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఫినిషింగ్‌లో రింకూ సింగ్ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. చివర్లో రమన్‌దీప్ సింగ్, మొయిన్ అలీ మంచి టచ్ ఇస్తే భారీ స్కోరును ఆశించొచ్చు. బౌలింగ్‌లో వైభవ్ అరోరా భారీ రన్స్ ఇస్తున్నాడు. మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి రన్స్ కట్టడి చేయడంతో పాటు వికెట్లూ తీయడం అనుకూలాంశం. నరైన్ స్పిన్ మ్యాజిక్ పని చేయడం లేదు. ఈ ఇద్దరు బౌలింగ్ ఫామ్ మెరుగుపడితే కేకేఆర్ విజయం నల్లేరు మీద నడకే. ఇక ప్లే ఆఫ్స్‌కు దూరమైన చెన్నై చివరి మెరుపులు చూపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ టీమ్ మొత్తంతో పాటు ఫ్యాన్స్ కూడా ధోనీ బ్యాటింగ్ మెరుపులపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. యంగ్‌స్టర్ ఆయుష్ మాత్రేపై ఎక్కువ అంచనాలున్నాయి. షేక్ రషీద్, సామ్ కరన్ వైఫల్యం టీమ్‌ను వెంటాడుతోంది. జడేజా ఆల్‌రౌండ్ షోతో టీమ్‌కు కొండంత అండగా మారడం కలిసొచ్చే అంశం. డేవ్లాడ్ బ్రెవిస్, శివమ్ దూబే బ్యాట్లు ఝుళిపించాలి. బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ పేస్ పెద్దగా పని చేయడం లేదు. స్పిన్నర్లు జడేజా, నూర్ అహ్మద్ ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తోంది. పేస్ ఆల్‌రౌండర్‌గా కరన్ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించలేకపోతున్నాడు.