
జైపూర్: కొద్దిలో ప్లేఆఫ్స్ బెర్తును చేజార్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి లీగ్ పోరులో విజయం సాధించి ఐదో ప్లేస్‌తో ఐపీఎల్18ను ముగించింది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తూ టాప్ ప్లేస్‌పై కన్నేసిన పంజాబ్ కింగ్స్‌ను దెబ్బకొట్టింది. సమీర్ రిజ్వీ (25 బాల్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 నాటౌట్) లీగ్‌లో తొలి ఫిఫ్టీతో సత్తా చాటడంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 206/8 స్కోరు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (34 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53), మార్కస్ స్టోయినిస్ (16 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో నాటౌట్) సత్తా చాటారు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (6) ఫెయిలైనా ప్రభ్‌సిమ్రన్ సింగ్ (28), జోష్ ఇంగ్లిస్ (32) రాణించారు. ముస్తాఫిజుర్ మూడు, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఢిల్లీ 19.3 ఓవర్లలో 208/4 స్కోరు చేసి గెలిచింది. కేఎల్ రాహుల్ (35), స్టాండిన్ కెప్టెన్ ఫా డుప్లెసిస్ (23) తొలి వికెట్‌కు 55 రన్స్ జోడించి మంచి ఆరంభం అందించారు. వరుస ఓవర్లలో ఈ ఇద్దరూ ఔటైనా టెస్టు టీమ్‌కు సెలెక్ట్ అయిన జోష్‌లో కరుణ్ నాయర్ (27 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) మెరుపులు మెరిపించాడు. సెదిఖుల్లా అటల్ (22) కూడా ఆకట్టుకోగా.. చివర్లో సమీర్ దూకుడుగా ఆడి జట్టుకు విజయం అందించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. మొత్తంగా 14 మ్యాచ్‌ల్లో ఏడో విజయంతో ఢిల్లీ 15 పాయింట్లు రాబట్టి ఐదో స్థానం సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్: 20 ఓవర్లలో 206/8 (శ్రేయస్ 53, స్టోయినిస్ 44 నాటౌట్, ముస్తాఫిజుర్ 3/33).
ఢిల్లీ: 19.3 ఓవర్లలో 208/4 (సమీర్ 58 నాటౌట్, కరుణ్ 44, హర్‌ప్రీత్ 2/41).