
బెంగళూరు: దాదాపు పదేళ్ల పాటు టీమిండియా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను నడిపించిన విరాట్ కోహ్లీ అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఒకప్పుడు సంచలనంగా మారింది. అయితే అప్పుడు తాను అలా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తాజాగా వెల్లడించాడు. నిరంతర ఒత్తిడి, బ్యాటింగ్‌పై అధిక అంచనాల వల్లే సారథ్యం నుంచి తప్పుకున్నానని కోహ్లీ వెల్లడించాడు. ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని తెలిపాడు. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత షార్ట్ ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విరాట్ ఆ వెంటనే ఆర్సీబీ నాయకత్వం నుంచి కూడా తప్పుకున్నాడు. ఓ ఏడాది తర్వాత టెస్ట్ కెప్టెన్సీ కూడా వదులుకున్నాడు. ‘నా కెరీర్‌లో ప్రతి అంశంపై నిరంతరం శ్రద్ధ పెట్టాల్సి రావడం భరించలేనంత స్థాయికి చేరింది. దానివల్ల చాలా ఒత్తిడికి లోనయ్యా.
ఇండియాకు ఏడు– ఎనిమిదేండ్లు, ఆర్సీబీకి తొమ్మిదేండ్లు నాయకత్వం వహించా. నేను ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ నా బ్యాటింగ్‌పై భారీ అంచనాలు ఉండేవి. నాపై అంచనాలు పెరిగిపోతున్నాయనే వాస్తవాన్ని కూడా గుర్తించలేని స్థితికి చేరుకున్నా. అదే ఒకవేళ కెప్టెన్సీ లేకపోతే కేవలం బ్యాటింగ్‌పైనే ఎక్కువ దృష్టి ఉండేది. 24/7 అవే ఆలోచనలతో ఉండేవాడ్ని. అది నాకు చాలా కఠినంగా అనిపించింది. చివరకు భరించలేని స్థితికి చేరింది. అందుకే కెప్టెన్సీ వదిలేశా’ అని విరాట్ పేర్కొన్నాడు. 2022లో క్రికెట్ నుంచి ఓ నెల రోజుల విరామం తీసుకున్న కోహ్లీ ఆ టైమ్‌లో కనీసం బ్యాట్‌ను కూడా తాకలేదు. దీంతో తన జీవితంలో సంతోషంగా ఉండటానికి కావాల్సిన టైమ్ వచ్చేసిందని భావించి కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు.
ఇక, సీనియర్ టీమ్‌లోకి వచ్చిన కొత్తలో అప్పటి కెప్టెన్ ధోనీ, కోచ్ గ్యార్ కిర్‌స్టెన్ తనను చాలా ప్రోత్సహించారని కోహ్లీ తెలిపాడు. వాళ్ల మద్దతుతోనే మూడో నంబర్ తనకు సుస్థిరంగా మారిందన్నాడు. ‘నా సామర్థ్యాల గురించి నాకు పూర్తిగా తెలుసు. ఇతరుల ఆటను చూసిన తర్వాత నా స్థాయి ఏంటో అర్థమైంది. జట్టు గెలవడానికి ఎంతకైనా తెగిస్తా. ఆ కారణంగానే నాకు దేశం తరఫున ఆడేందుకు అన్ని అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో కిర్‌స్టెన్, ధోనీ చాలా మద్దతిచ్చారు. మూడో నంబర్ నాదే అన్నట్లు చాలా స్పష్టంగా చెప్పారు. దాని వల్లే నా సహజమైన ఆటను ఆడాను’ అని విరాట్ చెప్పుకొచ్చాడు.