V6 News

కేకేఆర్కు తప్పని ఓటమి.. ఒక సీజన్‌లో తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా గెలవలే !

కేకేఆర్కు తప్పని ఓటమి.. ఒక సీజన్‌లో తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా గెలవలే !

అహ్మదాబాద్‌‌: అదే కథ, అదే వ్యథ. వేదికలు మారుతున్నా.. ప్రత్యర్థులు మారుతున్నా ఐపీఎల్‌‌19వ సీజన్‌‌లో కోల్‌‌కతా నైట్ రైడర్స్ ఆట, రాత మారడం లేదు. వరుసగా ఆరో మ్యాచ్‌‌లోనూ ఆ జట్టుకు నిరాశే. 25 కోట్ల ఆటగాడు  కామెరాన్ గ్రీన్ (55 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79) ఎట్టకేలకు హిట్టయినా.. కేకేఆర్ మాత్రం గెలుపు రుచి చూడలేపోయింది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌లో  5   వికెట్ల తేడాతో  గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలై ఐదో ఓటమి మూటగట్టుకుంది. 

మరోవైపు  కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్‌‌ (50 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86) క్లాసిక్ ఇన్నింగ్స్‌‌తో ఆకట్టుకోవడంతో జీటీ వరుసగా మూడో విక్టరీతో హ్యాట్రిక్ సాధించింది. తొలుత కేకేఆర్ 20 ఓవర్లలో 180 రన్స్‌‌కు ఆలౌటైంది. గ్రీన్ సత్తా చాటగా.. రోవ్‌‌మన్ పావెల్ (27) ఫర్వాలేదనిపించాడు. జీటీ బౌలర్లలో  రబాడ మూడు, సిరాజ్‌‌, అశోక్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం గుజరాత్ 19.4  ఓవర్లలో  181/5  స్కోరు చేసి గెలిచింది.   గిల్‌‌  కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

గ్రీన్ ఒక్కడే
కామెరాన్ గ్రీన్ ఎట్టకేలకు ఫామ్‌‌లోకి వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో తొలుత కోల్‌‌కతా మంచి స్కోరు చేసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌కు దిగిన ఆ టీమ్‌‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. టిమ్ సిఫర్ట్‌‌ (19) తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ అజింక్యా రహానె (0)ను తొలి ఓవర్లోనే సిరాజ్ గోల్డెన్ డకౌట్ చేసి షాకిచ్చాడు. ఇన్‌‌ఫామ్ బ్యాటర్ అంగ్‌‌క్రిష్ రఘువంశీ (5)తో పాటు సిఫర్ట్‌‌ ను రబాడ తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చడంతో 32/3తో కేకేఆర్ కష్టాల్లో పడింది. 

సిరాజ్‌‌, రబాడ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లేలో ఆటీమ్ 37 రన్స్ మాత్రమే రాబట్టింది. ఈ దశలో కామెరాన్ గ్రీన్‌‌, రోవ్‌‌మన్ పావెల్‌‌ ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దారు. తొలుత గ్రీన్ జాగ్రత్తగా ఆడగా.. ప్రసిధ్  బౌలింగ్‌‌లో సిక్స్‌‌, అశోక్ శర్మ వేసిన 8వ ఓవర్లో 6,4తో పావెల్ ఇన్నింగ్స్‌‌లో చలనం తెచ్చాడు. రషీద్ బౌలింగ్‌‌లో గ్రీన్, పావెల్  చెరో ఫోర్ కొట్టడంతో సగం  ఓవర్లకు కేకేఆర్‌‌‌‌ 80/3తో నిలిచింది.  క్రీజులో కుదురుకున్న పావెల్‌‌ను తర్వాతి ఓవర్లో అశోక్‌‌ ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌‌కు 55  రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. ఈ దశలో గ్రీన్‌‌ ఒక్కసారిగా గేరు మార్చాడు.

రషీద్ బౌలింగ్‌‌లో 6, 4తో టచ్‌‌లోకి వచ్చిన అతను అశోక్ శర్మ వేసిన  13వ ఓవర్లో 6, 6, 2తో 34 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.  ఆపై రషీద్ ఓవర్లో 6, 4, 4తో అలరించడంతో కేకేఆర్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, స్లాగ్ ఓవర్లలో జీటీ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు.  15వ ఓవర్లో అనుకూల్ రాయ్ (9)ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చి ఐదో వికెట్‌‌కు 60 రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌ బ్రేక్ చేయగా. హిట్టర్ రింకూ సింగ్ (1) మళ్లీ ఫెయిలయ్యాడు. తను  రబాడ బౌలింగ్‌‌లో బట్లర్‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు. ఓ సిక్స్, రెండు ఫోర్లతో జోరు మీద కనిపించిన రమణ్‌‌దీప్ (17) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. సునీల్ నరైన్ (0) ఐదు బాల్స్‌‌ ఆడి ఖాతా తెరవకుండానే డగౌట్ చేరగా.. ఓ సిక్స్ కొట్టిన కార్తీక్ త్యాగి (6) 19వ ఓవర్లో రనౌట్‌‌గా వెనుదిరిగాడు. చివరి ఓవర్లో  గ్రీన్‌‌ను ఔట్‌‌ చేసిన రషీద్ ఆరు రన్సే ఇచ్చాడు. మొత్తంగా ఆఖరి ఐదు ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ 32 రన్స్ మాత్రమే రాబట్టింది.

గిల్ ధనాధన్
కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్ ముందుండి నడిపించడంతో గుజరాత్ టార్గెట్‌‌ను సులువుగా చేరుకుంది. పవర్ ప్లేలో వేగంగా ఆడిన  సాయి సుదర్శన్ (22), గిల్  తొలి వికెట్‌‌కు 57 రన్స్ జోడించిన విజయానికి బలమైన పునాది వేశారు.  ఇన్నింగ్స్ నాలుగో బాల్‌‌ను బౌండరీ చేర్చిన గిల్..  కార్తీక్ త్యాగి వేసిన రెండో ఓవర్లో 4, 4తో స్పీడు పెంచాడు. అనుకూల్ వేసిన మూడో ఓవర్లో గిల్ ఒక సిక్స్‌‌ కొడితే.. సుదర్శన్ రెండు బాల్స్‌‌ను స్టాండ్స్‌‌కు చేర్చాడు. వైభవ్ ఆరోరా బౌలింగ్‌‌లో గిల్ మరో 6, 4 రాబట్టడంతో ఐదు ఓవర్లకే స్కోరు 50 దాటింది. ఆరో ఓవర్లో సుదర్శన్‌‌ను నరైన్ ఔట్ చేసినా వన్‌‌డౌన్‌‌లో  వచ్చిన బట్లర్ (25)  4, 6, 4తో కొట్టడంతో పవర్‌‌‌‌ప్లేను జీటీ 71/1తో ముగించింది. ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా గిల్ అదే జోరు కొనసాగించాడు.

కానీ, వరుణ్ చక్రవర్తి వేసిన పదో ఓవర్లో బట్లర్ భారీ షాట్‌‌కు ట్రై చేసి గ్రీన్‌‌కు చిక్కడంతో రెండో వికెట్‌‌కు 38 రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. అయినా గిల్  వెనక్కుతగ్గలేదు. 27 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అతను  చక్రవర్తి బౌలింగ్‌‌లోనే 4, 6తో మళ్లీ వేగం పెంచాడు.  అతనికి కాసేపు సపోర్ట్ ఇచ్చిన వాషింగ్టన్ సుందర్ (13)ను 15వ ఓవర్లో పెవిలియన్ చేర్చిన చక్రవర్తి కేకేఆర్‌‌‌‌ను రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. తర్వాతి ఓవర్లో అనుకూల్ ఐదే రన్స్‌ ఇవ్వగా.. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న గిల్..  వైభవ్ అరోరా బౌలింగ్‌‌లో గ్రీన్ పట్టిన సూపర్ క్యాచ్‌‌కు ఔటయ్యాడు. చివరి మూడు ఓవర్లలో గుజరాత్‌‌కు 23 రన్స్ అవసరం అవగా.. కార్తీక్ త్యాగి బౌలింగ్‌‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన గ్లెన్ ఫిలిప్స్‌‌ (19) గెలుపు ఖాయం చేశాడు.

సంక్షిప్త స్కోర్లు

  • కోల్‌‌కతా: 20 ఓవర్లలో 180 ఆలౌట్‌‌ (గ్రీన్ 79, పావెల్ 27,రబాడ 3/29, సిరాజ్ 2/23).
  • గుజరాత్‌‌: 19.4 ఓవర్లలో 181/5  (గిల్ 86, బట్లర్ 25, చక్రవర్తి 2/34).

ఒక సీజన్‌లో తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా గెలవకపోవడం కేకేఆర్‌‌కు ఇదే తొలిసారి.