నిర్మల్ జిల్లాలో బెట్టింగ్ దందా .. కూపీ లాగుతున్న పోలీసులు

నిర్మల్ జిల్లాలో బెట్టింగ్ దందా .. కూపీ లాగుతున్న పోలీసులు

నిర్మల్, వెలుగు: కొద్ది రోజులుగా నిర్మల్ జిల్లా కేంద్రంగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ దందా పెద్ద ఎత్తున సాగుతోంది. ఆదివారం నిర్మల్ లో ఇద్దరు బుకీలను పోలీసులు పట్టుకోవడంతో ముఠా గుట్టు రట్టయింది. బైంసాకు చెందిన రెహమాన్ ఈ మొత్తం దందాకు అసలు సూత్రధారుడని పోలీసులు గుర్తించారు. ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించి బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. 

నిర్మల్ తో పాటు ఆర్మూర్, ఖానాపూర్, ఆదిలాబాద్, జగిత్యాల, నాందేడ్, ధర్మాబాద్ తదితర ప్రాంతాలకు తన నెట్​వర్క్ ను విస్తరించినట్లు తెలిసింది. ఆయా ప్రాంతాల్లో క్రికెట్ లో బెట్టింగ్ పెట్టే వారినే కాకుండా మట్కా, పేకాట జూదరులను కూడా ఈ దందాలోకి దించినట్లు సమాచారం. ఐపీఎల్​మాత్రమే కాకుండా మిగతా ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీలకు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం వివరాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు. పట్టుబడ్డ నిందితుల ద్వారా సేకరించిన సమాచారం మేరకు బెట్టింగ్ ఆడే వారి జాబితాను రూపొందించారు. జాబితాలోని వారి బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టి, లావాదేవీలు జరుగుతున్న తీరును పరిశీలిస్తున్నారు. అయితే, పలు చోట్ల కొంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యమైన వ్యక్తులు సైతం ఈ క్రికెట్ బెట్టింగ్ లో పాల్గొంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పూర్తి సమాచారం సేకరించి, అసలు సూత్రధారులపై గట్టి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.