క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో ఐపీఎల్!

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో ఐపీఎల్!
  • వాంఖడేలో పది మంది గ్రౌండ్‌ స్టాఫ్‌, ఏడుగురు ఈవెంట్‌ మేనేజర్లకు కూడా
  • లాక్‌డౌన్‌ దిశగా మహారాష్ట్ర.. ముంబైలో మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు!
  • బ్యాకప్‌గా హైదరాబాద్‌, ఇండోర్‌ సిటీలను ఎంచుకున్న బీసీసీఐ
  • ప్రస్తుతానికైతే  షిఫ్ట్‌ చేసే ఆలోచన లేదంటున్న బోర్డు పెద్దలు

ఈ సీజన్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది.  కరోనా కేసులు పెరగడంతో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆలోచనతో ఉండగా.. ముంబై వాంఖడే స్టేడియంలో పది మంది గ్రౌండ్‌ స్టాఫ్‌, ఏడుగురు ఐపీఎల్‌  స్టాఫ్‌ పాజిటివ్‌గా తేలారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రికెటర్‌ అక్షర్‌ పటేల్‌, చెన్నై టీమ్‌లో మీడియా పర్సన్‌కు కూడా వైరస్‌ సోకింది. దాంతో, ముంబైలో ఐపీఎల్‌ మ్యాచ్‌ నిర్వహణపై అనుమానాలు మొదలయ్యాయి.  ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మొదట విస్మరించిన హైదరాబాద్‌ను బీసీసీఐ బ్యాకప్‌ వెన్యూగా ఎంచుకుంది.  ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ముంబై మ్యాచ్‌లను వేరే చోటుకి తరలించబోమని అంటున్నా.. పరిస్థితి చేయిదాటితే షిఫ్ట్‌ చేయక తప్పదు. చివరి నిమిషంలో  మ్యాచ్‌లు కేటాయించినా  నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని హెచ్‌సీఏ చెబుతోంది.

ముంబై: లాస్ట్‌ సీజన్‌ మాదిరిగా  ఐపీఎల్‌14వ ఎడిషన్‌ స్టార్టింగ్‌కు ముందు కరోనా కలకలం రేగింది. మరో వారం రోజుల్లో లీగ్‌ మొదలవనుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌  శనివారం పాజిటివ్‌గా తేలాడు.  ఇక, ముంబై వాంఖడే స్టేడియంలో పది మంది  గ్రౌండ్‌ స్టాఫ్‌, ఏడుగురు ఈవెంట్‌ మేనేజర్లకు కూడా వైరస్‌ సోకింది.  మరోవైపు  మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో   మినీ లాక్‌ డౌన్‌ విధించాల్సి వస్తుందని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే  చెబుతున్నారు. దాంతో, ఈ నెల 10–25 మధ్య ముంబైలో షెడ్యూల్‌ చేసిన పది మ్యాచ్‌లపై నీలినీడలు కమ్ముకున్నాయి.  ముంబైలోనే మ్యాచ్‌లు నిర్వహిస్తామని బోర్డు నమ్మకంగా ఉన్నప్పటికీ  ముందు జాగ్రత్తగా  హైదరాబాద్‌తో పాటు  ఇండోర్‌లను స్టాండ్‌బై వెన్యూలుగా ఎంపిక చేసింది.  ‘మా స్టాండ్‌బై వెన్యూస్‌లో హైదరాబాద్‌ ఒకటి. కానీ, ఇంత తక్కువ టైమ్‌లో మరో సిటీలో బయో–బబుల్‌ క్రియేట్‌ చేయడం చాలా కష్టం. ప్రస్తుతం అన్ని టీమ్స్‌ బయో బబుల్‌లోనే ఉన్నాయి.  మహారాష్ట్రలో లాక్‌డౌన్‌లో పెడితే  స్టేడియం, ఇతర  పరిసరాల్లోనూ జనాలు ఉండబోరు కాబట్టి మ్యాచ్‌ల నిర్వహణ మరింత సులభం అవుతుంది. కాబట్టి ముంబై మ్యాచ్‌లు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని మేం ఇప్పటికీ నమ్మకంగా ఉన్నాం. ఒకవేళ పరిస్థితి చేయిదాటితే  హైదరాబాద్‌, ఇండోర్‌ స్టాండ్‌బైగా ఉండనే ఉన్నాయి’ అని బోర్డు సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు అక్షర్‌ పాజిటివ్‌గా తేలిన విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ ధ్రువీకరించింది. ‘అక్షర్‌ నెగెటివ్‌ రిపోర్టుతో ఈ నెల 28న టీమ్‌ హోటల్‌కు వచ్చాడు. కానీ, సెకండ్‌ టెస్టులో పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న అతడిని మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షిస్తోంది’ చెప్పింది. 10 రోజుల ఐసోలేషన్​ తర్వాత రెండు నెగెటివ్​ టెస్టులు వస్తేనే అక్షర్​ బరిలోకి దిగుతాడు. దాంతో, పదో తేదీన సీఎస్‌కేతో జరిగే తమ ఫస్ట్‌ మ్యాచ్‌తో పాటు 15న జరిగే రెండో మ్యాచ్‌కు అతను దూరం కానున్నాడు. 

ఫ్రాంచైజీల్లో ఆందోళన
ఈ సీజన్​ ఐపీఎల్​ కోసం ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్​, కోల్​కతాను వేదికలుగా ఎంచుకున్నారు.  తొలి దశ పోటీలను ఈ నెల 9 నుంచి  25 వరకు చెన్నై చిదంబరం, ముంబై వాంఖడే స్టేడియాల్లో షెడ్యూల్‌ చేశారు. ఓ రోజు చెన్నైలో, మరో రోజు ముంబైలో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌, పంజాబ్‌, సీఎస్​కే ముంబై బేస్‌గా ఉన్నాయి. ముంబై, సన్‌రైజర్స్‌, ఆర్‌సీబీ, కేకేఆర్‌.. చెన్నైలో తలపడతాయి. వాంఖడేలో సిబ్బంది,  ఢిల్లీ టీమ్‌లో అక్షర్‌  పాజిటివ్‌గా తేవడంతో ముంబైలో ఉన్న ఫ్రాంచైజీలు ఆందోళన చెందుతున్నాయి. 

మేం రెడీగా ఉన్నాం: హెచ్​సీఏ
ఐపీఎల్‌ మ్యాచ్‌లను చివరి నిమిషంలో తమకు కేటాయించినా నిర్వహించేందుకు రెడీగా ఉన్నట్టు హెచ్‌సీఏ సెక్రటరీ విజయానంద్‌ చెప్పారు. అందుకోసం ఉప్పల్‌ స్టేడియం పిచ్‌, ఔట్‌ ఫీల్డ్‌ ఇతర సౌకర్యాలను సిద్ధంగా ఉంచుతున్నట్టు తెలిపారు. వాస్తవానికి గతనెల 17వ తేదీన బీసీసీఐ ట్రెజరర్‌ అరుణ్‌ ధూమల్‌ నగరానికి వచ్చి ఉప్పల్‌ స్టేడియాన్ని పరిశీలించారు. గ్రౌండ్‌ కండిషన్స్‌, స్టేడియం ఫెసిలిటీస్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. సిటీకి మ్యాచ్‌లు కేటాయిస్తే  రెడీగా ఉండాలని హెచ్‌సీఏ అధికారులకు  సూచించారు.