ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ రాజీనామా

ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ రాజీనామా
  • వాలెంటరీ రిటైర్మెంట్ కు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడి

హైదరాబాద్: ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వాలెంటరీ రిటైర్మెంట్: వీఆర్ఎస్)కోరుతూ ఆయన సోమవారం ప్రభుత్వానికి ఈమెయిల్ చేశారు. తన స్వచ్ఛంద పదవీవిరమణ గురించి ఆయనే ట్విట్టర్ ద్వారా బహిర్గతం చేశారు. తాను ఎందుకు రాజీనామా చేయబోతున్నది తెలియజేస్తూ ప్రజలకు రెండు పేజీల లేఖ ద్వారా వివరించారు. రెండు పేజీల లేఖను ట్విట్టర్ లో వెల్లడించారు.  1995 బ్యాచ్ కు చెందిన ప్రవీణ్ కుమార్ అదనపు డీజీపీ హోదాలో  ప్రస్తుతం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. 26 ఏళ్ల సుదీర్ఘ ప్రభుత్వ సర్వీసు నుండి వ్యక్తిగత కారణాల వల్ల ఇంకా ఆరు సంవత్సరాల సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించారు. ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలోని పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, అరకొర వసతుల నడుమ ఎంతో శ్రమించి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐపీఎస్ ఉద్యోగంలో చేరి.. రెండున్నర దశాబ్దాలపాటు సేవలు అందించానని గుర్తు చేసుకున్నారు. పదవీ కాలం పూర్తి కాకముందే వీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవాల్సి రావడం కొంత బాధ కలిగించినా ఎట్టకేలకు ఎలాంటి పరిమితులు లేకుండా.. నా మనసుకు ఇష్టమైన పనులను నాకు నచ్చిన రీతిలో చేయబోతుండడం తనకు ఆనందంతోపాటు మరింత ఉత్సాహాన్ని.. కొత్త శక్తిని ఇస్తోందని ఆ లేఖలో ప్రవీణ్ కుమార్ వివరించే ప్రయత్నం చేశారు.