
సీరియల్ ఆర్టిస్ట్ నంద కిషోర్, రోజా జంటగా దుర్గా దేవ్ నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రవీణ్ ఐపీఎస్’. నీలా మామిడాల నిర్మించిన ఈ చిత్రాన్ని మాజీ ఐపీఎస్, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ అధినేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బయోపిక్‌గా రూపొందించారు. ఫిబ్రవరి 16న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ మూవీ ట్రైలర్‌ను దర్శకులు సి.ఉమామహేశ్వరరావు, ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల రిలీజ్ చేసి టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. నంద కిషోర్ మాట్లాడుతూ ‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రోల్ పోషించడం అదృష్టంగా భావిస్తున్నా.
ఆయన సంకల్పం చాలా గొప్పది, ఎంతో మందికి ఆదర్శం. ఆయనలా తెరపై కనిపించేందుకు ప్రయత్నించా’ అని అన్నాడు. విద్యా ప్రాముఖ్యతను ఇందులో చూపించారని, చిన్న పిల్లలకు ఈ సినిమాను చూపించాల్సిన అవసరముందని చెప్పింది రోజా. దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ ‘ఆర్ఎస్పీ గారు నాకు ఇన్‌స్పిరేషన్. ఆయన జీవితాన్ని మూడు పార్టులుగా తీయాలి. కానీ సెలెక్టివ్ అంశాలను మాత్రమే తీసుకుని ఈ సినిమా రూపొందించాం’ అని చెప్పాడు. నిర్మాత డీఎస్ రావు, బీఎస్పీ సీనియర్ నేత విజయ్ ఆర్య సహా మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.