నిరసనకారులపై ఇరాన్ ఉక్కుపాదం

నిరసనకారులపై ఇరాన్ ఉక్కుపాదం

టెహ్రాన్: యాంటీ హిజాబ్ నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. వరుసగా ఎనిమిదో రోజు దేశవ్యాప్తంగా భారీగా మహిళలు రోడ్ల మీదకు వచ్చి నిరసన గళాలు వినిపించారు. హిజాబ్ ధరించలేదని మాషా అమినీ(22) అనే యువతిని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేయగా, కోమాలోకి వెళ్లిన ఆమె ఈ నెల 16న చనిపోవడంతో ప్రభుత్వానికి, ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. మహిళలు జుట్టు కత్తిరించుకుంటూ, హిజాబ్​లను తగలబెడ్తూ రోజూ నిరసనలు తెలియజేస్తున్నారు. శనివారం నాటికి దేశవ్యాప్తంగా 31 ప్రావిన్స్​లలోని 80 సిటీలు, టౌన్​లకు నిరసనలు పాకినట్లు ఓస్లోకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్  సంస్థ వెల్లడించింది. అనేక సిటీల్లో నిరసనలు హింసాత్మకం అవుతున్నాయని పేర్కొంది.  

ఉక్కుపాదం మోపుతున్న సర్కార్ 

నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఒక్క గిలాన్ ప్రావిన్స్ లోనే ఇప్పటిదాకా 739 మందిని అరెస్ట్ చేశారని, వీరిలో 60 మంది మహిళలు ఉన్నారని మీడియా తెలిపింది. నిరసనల్లో ఇప్పటివరకూ 17 మంది చనిపోయారని ప్రభుత్వం చెప్తున్నా.. ఐదుగురు పోలీసులు, 45 మంది నిరసనకారులు చనిపోయారని ఐహెచ్ఆర్ వెల్లడించింది. ఇంటర్నెట్ సర్వీస్​లపై ఇరాన్ ఆంక్షలు​ విధించడంతో నిరసనకారులకు మద్దతుగా స్టార్​లింక్​ శాటిలైట్ సర్వీస్​ను అక్కడ యాక్టివేట్​ చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. మరోవైపు, ప్రభుత్వానికి మద్దతుగా కౌంటర్ నిరసనలు కూడా మొదలయ్యాయి. మహిళలు హిజాబ్​లు ధరించి, ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటిస్తూ ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు.

యూఎస్ నేవీలోనూ హిజాబ్​లకు పర్మిషన్ 

అమెరికా మిలిటరీలోని అన్ని విభాగాల్లో హిజాబ్ లు, స్కల్ క్యాప్ లు, టర్బన్ ల వంటి మతపరమైన దుస్తులు ధరించేందుకు అనుమతించాలంటూ ప్రెసిడెంట్ అడ్వైజరీ కమిషన్ సిఫారసు చేసింది. కమిషన్ తన నివేదికను శుక్రవారం విడుదల చేసింది. అమెరికా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్​లో రిలీజియస్ డ్రెస్ కోడ్​కు సంబంధించి ఇదివరకే నిబంధనలను సడలించగా, నేవీ, మెరైన్స్ విభాగాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రెసిడెంట్ అడ్వైజరీ కమిషన్ నివేదికను వైట్ హౌజ్ డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ పరిశీలిస్తోంది.