దాడులు కొనసాగితే..యురేనియాన్ని ఆయుధ స్థాయికి పెంచుతం.. అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

దాడులు కొనసాగితే..యురేనియాన్ని ఆయుధ స్థాయికి పెంచుతం.. అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడికి పాల్పడితే తమ వద్ద ఉన్న యురేనియం నిల్వలను అణుబాంబు తయారీకి అవసరమైన స్థాయికి పెంచుతామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌‌‌‌‌‌‌‌పై కొత్త సైనిక చర్యలను పరిశీలిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఇరాన్ పార్లమెంటరీ కమిషన్ ప్రతినిధి ఇబ్రహీం రెజాయ్ మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. 

‘అమెరికా లేదా ఇజ్రాయెల్ దళాల నుంచి మా దేశంపై మరోసారి దాడి జరిగితే వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేస్తం. అందులో ఒకటి యురేనియం నిల్వలను 90% స్వచ్ఛతకు పెంచడం. అంటే అణ్వాయుధాల తయారీకి అవసరమైన స్థాయికి యురేనియంను సిద్ధం చేయడానికి మేం వెనుకాడం. మా సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా ఎటువంటి సైనిక చర్యలు జరిగినా దానికి ధీటైన సమాధానం ఇస్తాం" అని ట్వీట్ చేశారు. 

ఇరాన్ వద్ద ఇప్పటికే సుమారు 11,000 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉందని.. అందులో 441 కిలోలు 60% స్వచ్ఛతకు చేరుకున్నాయని, దీనిని ఆయుధ స్థాయికి పెంచడం సాంకేతికంగా చాలా సులభమని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇరాన్ అణు నిల్వలను న్యూక్లియర్ డస్ట్​గా అభివర్ణించిన ట్రంప్.. ఆ దేశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయనివ్వబోమని, ఎవరైనా అణు కేంద్రాల దరిదాపుల్లోకి వస్తే పేల్చివేస్తామని హెచ్చరించారు.