టెహ్రాన్: పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పిన మరుసటి రోజే ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ యూ-టర్న్ తీసుకున్నారు. తమ దేశంపై ఎలాంటి దాడి జరిగినా కచ్చితంగా బదులిస్తామని గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘నా మాటల పట్ల శత్రువులకు కొన్ని అపోహలు ఉన్నాయి. మాపై దాడి జరిగినప్పుడు, సమాధానం ఇవ్వడం తప్ప మాకు మరో మార్గం లేదు. మాపై ఒత్తిడి పెరిగేకొద్దీ.. మా ప్రతిస్పందన కూడా అంతే బలంగా ఉంటుంది.
ఇరాన్ ఎన్నడూ అణచివేతకు, దురాక్రమణకు తలవంచలేదు. ఇకముందు కూడా వంచదు”అని స్పష్టం చేశారు. బహ్రెయిన్, కువైట్, యూఏఈ సహా ఇతర పశ్చిమాసియా దేశాల్లో పేలుళ్లు కొనసాగుతున్న తరుణంలో ఇరాన్ అధ్యక్షుడి నుంచి ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
దుబాయ్‌లోని ప్రసిద్ధ మెరీనా ప్రాంతంలో ఒక నివాస భవనంపై క్షిపణి శకలాలు పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శాంతి దిశగా అడుగులు వేస్తున్నారని భావించిన తరుణంలో, ఇరాన్ మళ్లీ దాడులకు దిగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నది. కాగా, ఇరాన్ జ్యుడీషియరీ చీఫ్ గులాం హుస్సేన్ మొహసేని ఎజేయ్ మాట్లాడుతూ.. పొరుగు దేశాల్లోని కొన్ని ప్రాంతాలు ‘శత్రువుల అధీనంలో’ ఉన్నాయని, అలాంటి లక్ష్యాలపై భారీ దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు.
