ఇరాన్‌లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పాలనతో విసిగిపోయిన ప్రజలు రోడ్డెక్కారు.నియంత ఖమేనీ నశించాలి..ఇస్లామిక్ రిపబ్లిక్ నశించాలి అంటూ నినాదాలతో ఆందోళనలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే..ఇరాన్‌లో ఉద్రిక్తతలు, నిరసనకారులపై అణిచివేతపై అమెరికా మరోసారి స్పందించింది. ఇరాన్ ప్రజలకు అండగా ఉంటామని ప్రకటించింది. ధైర్యవంతులైన ప్రజలకు మద్దతు ఉంటుందని అని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. సుప్రీం లీడర్ ఖమేనీ నిరసనలలో అమెరికా పాత్ర ఉందని ఆరోపించినప్పటికీ, శాంతియుత నిరసనకారులను చంపితే సైనిక దాడులకు పాల్పడతామని ట్రంప్ ఇప్పటికే ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చారని స్పష్టం చేశారు.
ఇరాన్ చివరి రాజు కొడుకు రెజా పహ్లావి పిలుపు మేరకు ప్రజలు గురువారం రాత్రి రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆదేశాలతోదేశవ్యాప్తంగా ఇంటర్నెట్, ఇంటర్నేషనల్ టెలిఫోన్ సేవలను నిలిపివేశారు. గతంలో హిజాబ్ వ్యతిరేక పోరాటాలను అణచివేసిన ఆగ్రహం ఇంకా రగులుతూనే ఉందని నిరసనకారులు తెలిపారు. ఇప్పుడు దానికి ఆర్థిక కష్టాలు తోడయ్యాయని మండిపడ్డారు. డిసెంబర్లో మొదలైన నిరసనలతో ఇప్పటి దాకా 65 మందికి పైగా చనిపోయారు. 2 వేల 300మందికి పైగా అరెస్ట్ అయ్యారని పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. ఖమేనీ చాలా భయపడుతున్నారు. ఆయన త్వరలోనే దేశం విడిచి పారిపోయే అవకాశం ఉంది” అని ట్రంప్ హింట్ ఇచ్చారు. ‘‘శాంతియుతంగా నిరసన తెలిపే వారిని చంపితే మేము చూస్తూ ఊరుకోం. ఇరాన్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ది చెప్తం’’అని ట్రంప్ హెచ్చరించారు.
ఖమేనీ ఎక్కడ ఉన్నారు?..
ఇరాన్ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యాపించిన క్రమంలో సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నాడనేది చర్చనీయాంశమైంది. ఇరాన్ రాష్ట్ర మీడియా ప్రకారం.. ఖమేనీ ఇరాన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికీ టెహ్రాన్ లోనే ఉన్నాడని రాష్ట్ర మీడియా ఫుటేజ్ చెబుతోంది. అయితే నిరసనల వ్యాప్తి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా దేశం విడిచి రష్యాకు పారిపోయడని పుకార్లు ఊపందుకున్నాయి. దీంతో శుక్రవారం ఖమేనీ బహిరంగంగా కనిపించి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో నిరసనలను అదుపులోకి తెస్తామని నొక్కి చెప్పారు.
ఖమేనీ బహిరంగ ప్రసంగం తర్వాత అమెరికా విదేవాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ పై అమెరికా సైనికచర్యకు దిగే అవకాశం ఉందన్న పుకార్లకు బలం చేకూరుస్తున్నాయి.
