V6 News

హర్మూజ్ జలసంధిలో మరోసారి హైటెన్షన్.. ఇరాన్ నౌకపై అమెరికా కాల్పులు..డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్

హర్మూజ్ జలసంధిలో మరోసారి  హైటెన్షన్.. ఇరాన్ నౌకపై అమెరికా కాల్పులు..డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్

 ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధి దగ్గర మరోసారి  రణరంగంగా మారింది.  ఇరాన్‌కు చెందిన ఒక భారీ వాణిజ్య నౌకను అమెరికా దళాలు కాల్పులు జరిపి స్వాధీనం చేసుకుంది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తోంది.దీంతో మరోసారి గల్ఫ్‌ తీరంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

అసలేం జరిగిందంటే.. ఇరాన్‌ జెండాతో బందర్ అబ్బాస్ ఓడరేవు వైపు ప్రయాణిస్తున్న  900 అడుగుల పొడవున్న టౌస్కా అనే రవాణా నౌక, అమెరికా విధించిన నావికాదళ దిగ్బంధాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అమెరికా డెస్ట్రాయర్  రంగంలోకి దిగింది. తొలుత హెచ్చరికగా వార్నింగ్ షాట్లు జరిపినప్పటికీ, ఇరాన్ నావికులు లొంగకపోవడంతో.. అమెరికా దళాలు నేరుగా నౌక ఇంజిన్ రూమ్‌పై కాల్పులు జరిపి దానిని నిలిపివేశాయి. ఈ  విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇరాన్ నౌక మా నిబంధనలను అతిక్రమించాలని చూసింది  కానీ అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం ఆ నౌక మా పూర్తి అదుపులో ఉంది  అంటూ ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అటు అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను విడుదల చేసింది.

అమెరికా తీసుకున్న ఈ చర్యపై ఇరాన్ నిప్పులు చెరుగుతోంది. దీనిని సాయుధ పైరసీగా అభివర్ణించిన ఇరాన్.. వెంటనే ప్రతీకార దాడులకు దిగింది. ఐఆర్‌జీసీ (IRGC) దళాలు అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌ నుంచి అమెరికా నౌకలను తరిమికొట్టినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ 'ప్రెస్ టీవీ' వెల్లడించింది.

రెండు వారాల పాటు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో తాజా ఘటనతో మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. అగ్రరాజ్యం అమెరికా మొండితనం, ఇరాన్ ప్రతీకారేచ్ఛ మధ్య ఈ సముద్ర పోరాటం ఎటు దారితీస్తుందో అన్న భయం ప్రపంచ దేశాలను వణికిస్తోంది.