
ఇరాక్ లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. షియా మతాధికారి ముక్తాదా అల్ సదర్ రాజకీయాలకు రిటైర్ మెంట్ ప్రకటించారు. దీంతో ఇరాక్ లో హింస చెలరేగింది. ముక్తాదా మద్దతు దారులు ప్రభుత్వ భవనాన్ని ముట్టడించారు. ఇరాక్ రాజధాని బాగ్ధాద్ లో భారీ ప్రదర్శనలు కొనసాగాయి. మరోవైపు అల్లర్లు చెలరేగగా.. బాగ్ధాద్ గ్రీన్ జోన్ లో పలువురు ఆందోళనకారులపై సైన్యం జరిపిన కాల్పుల్లో 12 మంది చనిపోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. షియా మతాధికారికి మద్దుతుగా ఆందోళనలు జరుగుతుండటంతో.. ఇరాక్ వ్యాప్తంగా అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించింది.
ఇరాక్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు షియా మతాధికారి ముక్తాదా అల్ సదర్ ట్విట్టర్ లో ప్రకటించారు. అలాగే తన పార్టీ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆయన మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. రిపబ్లికన్ ప్రభుత్వం బిల్డింగ్ బయట బీభత్సం సృష్టించారు. ప్యాలెస్ గేట్లు పగులగొట్టారు. షియా మతాధికారి మద్దతుదారులను రాజభవనానికి దూరంగా ఉండాలని.. విధ్వంసాన్ని ఆపాలని సైన్యం కోరింది. అయితే.. అల్ సదర్ రాజకీయాల నుంచి రిటైర్ మెంట్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలానే చాలా సార్లు ప్రకటించారు. ముక్తాదా చర్యలతో ఇరాక్ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు.