న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్‌కు చెందిన ఇన్సూరెన్స్ కంపెనీలను దక్కించుకునేందుకు ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఐఐహెచ్‌ఎల్) నేతృత్వంలోని కన్సార్టియంకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) అనుమతులిచ్చింది. అక్షయ తృతీయ నాడు అనుమతులు పొందడం ఆనందంగా ఉందని ఐఐహెచ్‌ఎల్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఎన్‌సీఎల్‌టీ వద్ద ఈ డీల్‌ను తొందరగా పూర్తి చేసేందుకు పనిచేస్తున్నామని, ఈ నెల 27 లోపు ఇతర రెగ్యులేటరీ అప్రూవల్స్ అందుకుంటామని అంచనా వేసింది.
ఇన్సూరెన్స్ సెక్టార్‌లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ల (ఎఫ్‌డీఐల) లిమిట్ 74 శాతం. దీనిని చేరుకోవడానికి ఐఐహెచ్‌ఎల్ తన కన్సార్టియంలో మార్పులు చేసింది. మారిషస్ బేస్డ్ కంపెనీ అయిన ఐఐహెచ్‌ఎల్ తనకు చెందిన ఇండియన్ కంపెనీలను కన్సార్టియంలో జాయిన్ చేసుకుంది. సైకర్ ఇండియా, ఎకోపోలిస్ ప్రాపర్టీస్, సైకరెక్స్ టెక్నాలజీస్, ఐఐహెచ్‌ఎల్ బీఎఫ్‌ఎస్‌ఐ హోల్డింగ్‌లు తాజాగా కన్సార్టియంలో జాయిన్ అయ్యాయి. ఆసియా ఎంటర్‌ప్రైజెస్‌కు హోల్డింగ్ కంపెనీగా ఉన్న సైకర్ ఇండియాలో హిందుజా బ్రదర్స్ అశోక్ హిందుజా, హర్ష హిందుజా, షోమ్ హిందుజాకు వాటాలు ఉన్నాయి.
ఇండియన్ పాస్‌పోర్టులు ఉండడంతో వీరిని ఇండియన్ ఇన్వెస్టర్లుగా పరిగణిస్తున్నారు. సైకరెక్స్ టెక్, ఎకోపోలిస్ ప్రాపర్టీస్‌లో ఆసియా ఎంటర్‌ప్రైజెస్‌కు 100 % వాటా ఉంది. ఐఐహెచ్‌కు ఐఐహెచ్ఎల్ బీఎఫ్‌ఎస్‌ఐ సబ్సిడరీ కంపెనీ. రిలయన్స్ క్యాపిటల్‌కు రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 51 % వాటా ఉంది. మిగిలిన 41% వాటా నిప్పాన్ లైఫ్ ఆఫ్ జపాన్ కంట్రోల్లో ఉంది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌లో కంపెనీకి పూర్తి వాటా ఉంది.
