
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ గైర్హాజరీలో ఇండియా టెస్టు టీమ్ కెప్టెన్సీ రోహిత్ శర్మకే అప్పగించాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంటున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో ఫస్ట్ టెస్టు అనంతరం కోహ్లీ పెటర్నిటీ లీవ్ తీసుకోనున్నాడు. దాంతో, మిగతా సిరీస్‌లో టెస్టు టీమ్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానె ఇండియాను నడిపించనున్నాడు. అయితే, రహానె కంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్ అయిన రోహితే టీమ్‌కు సారథ్యం వహించాలని ఇర్ఫాన్ సూచిస్తున్నాడు. అలాగే, సిరీస్‌లో హిట్‌మ్యాన్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే జట్టుకు లాభం ఉంటుందని చెప్పాడు. ‘ఆసీస్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ లేకపోతే టీమ్‌పై చాలా ప్రభావం పడుతుంది. కానీ, అతని నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. క్రికెట్‌ను మించిన జీవితాన్ని, ఫ్యామిలీ చాలా ముఖ్యం అన్న విషయాన్ని మనం అంగీకరించాలి. ఫీల్డ్‌లో కోహ్లీ ఉంటే చాలా ప్రభావం ఉంటుంది. అన్ని కండీషన్స్‌లోనూ ఇన్నేళ్లుగా అతను ఎలా పెర్ఫామ్ చేస్తున్నాడో చూస్తున్నాం. రహానెకు నేను వ్యతిరేకం కాదు కానీ ఈ సిరీస్‌లో రోహితే కెప్టెన్‌గా ఉండాలి’ అని పఠాన్ చెప్పుకొచ్చాడు.