బిజినెస్​ లావాదేవీలే హత్యకు కారణం

బిజినెస్​ లావాదేవీలే హత్యకు కారణం

హైదరాబాద్ పంజాగుట్టలో శనివారం నడి రోడ్డుపై ఆగంతుకుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఐరన్​వ్యాపారి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో దాడికి వ్యాపార లావాదేవీలే కారణమని గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన తెలపనూరు రాంప్రసాద్ గచ్చిబౌలి ఖాజాగూడలో నివాసం ఉంటున్నాడు. సిటీతోపాటు విజయవాడ, గుంటూరు, ఒంగోలులో ఐరన్ అండ్ స్టీల్ వ్యాపారం చేస్తున్నాడు. కొంత కాలంగా రాంప్రసాద్ పంజాగుట్టలోని దుర్గానగర్ కాలనీలో తన కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి 8 గంటలకు ఆఫీస్ క్లోజ్ చేసి డ్రైవర్ రమేశ్​తో కలిసి పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాడు. తర్వాత ఇంటికి బయలుదేరిన రాంప్రసాద్ పై ముగ్గురు ఆగంతుకులు కత్తులతో దాడి చేశారు. పారిపోవడానికి యత్నించిన రాంప్రసాద్ ను వెంటపడిమరీ మెడ, తల భాగంలో గాయపరిచి అక్కడి నుంచి కారులో పారిపోయారు. స్థానికులు సహాయంతో కారు డ్రైవర్​రాంప్రసాద్​ను సోమాజీగూడలోని యశోద హాస్పిటల్​కు తరలించాడు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు.

పక్కాప్లాన్​తో..

పంజాగుట్ట పీఎస్​కు అతి సమీపంలోనే ఈ దాడి జరగడంతో కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే రెండు చోటుచేసుకోవడంతో రాంప్రసాద్ హత్య ను సవాల్ గా తీసుకున్నారు. ఏసీపీ తిరుపతన్న ఆధ్వర్యంలో నాలుగు స్పెషల్​టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ లో సేకరించిన ఆధారాలతో పాటు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. మొత్తం నలుగురు దుండగులు దాడిలో పాల్గొన్నారని పోలీసులు నిర్ధరించారు. ముగ్గురు రాంప్రసాద్ పై కత్తులతో దాడి చేశారని గుర్తించారు. కీలక ఆధారాలు సేకరించారు. పక్కా ప్లాన్​తో హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వారం రోజుల పాటు రెక్కీ

ఐరన్ అండ్ స్టీల్ వ్యాపారం చేసే రాంప్రసాద్ కు ఆర్థికపరమైన వివాదాలున్నాయని పోలీసులు గుర్తించారు. అయితే విజయవాడలో నిర్వహించిన స్టీల్ వ్యాపార లావాదేవీలే రాంప్రసాద్ హత్యకు కారణమని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. గతంలో కోగంటి సత్యం అనే భాగస్వామితో పాత కక్షలున్నాయని చెప్పారు. అతడి నుంచి అనేక సార్లు బెదిరింపులు వచ్చాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. రూ.50 కోట్లకు సంబంధించిన వ్యాపార లావాదేవీలే రాంప్రసాద్ హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు అంచనా వేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అదుపులో అనుమానితులు

ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కోగంటి సత్యంతో పాటు విజయవాడలోని మరికొందరురాజకీయవేత్తలు, వ్యాపార ప్రముఖుల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. ఇప్పటికే రాంప్రసాద్ కాల్ డేటాతో పాటు ఆయనతో కలిసి వ్యాపారం చేస్తున్న వారిని విచారించారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్క్ పోలీసులు హంతకుల కోసం ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. రాంప్రసాద్ హత్య కేసులో కోగంటి సత్యం పేరు బయటకు రావడంతో ఆయన మీడియా ముందుకు వచ్చాడు. తనకు రాంప్రసాద్ ను చంపాల్సిన అవసరం లేదన్నారు. ఆర్థికపరమైన కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయని తెలిపాడు. కావాలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పాడు.