స్కూల్ ఎడ్యుకేషన్​ అనాలోచిత నిర్ణయాలు

స్కూల్ ఎడ్యుకేషన్​ అనాలోచిత నిర్ణయాలు

హైదరాబాద్, వెలుగు : స్కూల్ ఎడ్యుకేషన్ లో అనాలోచిత నిర్ణయాలు అందరినీ పరేషాన్ చేస్తున్నాయి. హడావుడిగా ఉత్తర్వులు ఇచ్చి వెంటనే వెనక్కి తీసుకుంటున్నారు. టెన్త్ పరీక్షల మొదలు తాజాగా ఇచ్చిన ఎన్​రోల్మెంట్ డ్రైవ్ వరకూ ఇలాగే జరిగింది. అయితే కొన్ని అంశాలపై నెలల తరబడి నిర్ణయాలు తీసుకోవడం లేదు. సమస్యలు చెప్పుకునేందుకూ డైరెక్టరేట్​లో కనీసం విజిటింగ్​అవర్స్​ లేవని టీచర్ల సంఘాలు వాపోతున్నాయి. ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలతో స్టూడెంట్లు, టీచర్లకే నష్టమని వారు చెప్తున్నారు. రాష్ట్రంలో 41 వేలకు పైగా స్కూళ్లుండగా, వాటిలో సుమారు మూడు లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. 59 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ఆ బడులన్నింటినీ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​ సమన్వయం చేస్తోంది. అకాడమిక్ మొదలు, సర్వీస్ మ్యాటర్స్ వరకూ ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా బడులు తెరిచిన మూడు నెలలకు స్టూడెంట్లకు పుస్తకాలు, యూనిఫామ్స్ అందాయి. అయితే ఇంకా స్కూళ్లకు ఒక్క పైసా కూడా గ్రాంట్స్ ఇవ్వలేదు. ఆగస్టు 15  సందర్భంగా సర్కారు నిర్వహించిన వజ్రోత్సవాలకు ప్రత్యేకంగా నిధులు ఇస్తామని ప్రకటించినా ఇప్పటికీ పైసా ఇవ్వలేదు. ఇలాంటి అనేక సమస్యల మధ్య బడులు నడుస్తుండగా, అధికారులు ఇచ్చే ఉత్తర్వులు టీచర్లు, పేరెంట్స్​ను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అనుభవమున్న కొందరు సీనియర్ ఆఫీసర్లను చిన్నచిన్న విభాగాలకు పంపించినా, కనీసం సమావేశాల్లో వారి సలహాలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. దీంతో ఇటీవల పలు నిర్ణయాలు విమర్శలకు దారితీశాయి. అవగాహన లేకుండా ఆదేశాలివ్వడం, సర్కారు పెద్దలు ఆక్షేపించడంతో వెనక్కి తగ్గడం పరిపాటిగా మారుతోంది. మరోపక్క డైరెక్టరేట్​లో కొంతకాలంగా విజిటింగ్ అవర్స్​ కూడా సక్రమంగా నిర్వహించడం లేదని టీచర్ల సంఘాలు చెప్తున్నాయి. దీంతో అనివార్యంగా విద్యా శాఖ సెక్రటరీ, విద్యా శాఖ మంత్రిని కలిసేందుకు యూనియన్లు క్యూ కడుతున్నాయి. 

కొన్ని వివాదాస్పద నిర్ణయాలు

సర్కారు టీచర్లు, ఇతర ఉద్యోగులూ ఏటా తమ ఆస్తుల వివరాలు ఇవ్వాలని , స్థిర చర ఆస్తులు కొన్నా, అమ్మినా పర్మిషన్ తీసుకోవాలని జూన్​లో ప్రభుత్వం ఆదేశించింది. కానీ టీచర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. 

టెన్త్ లో ఆరు పేపర్లు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఎస్ఏ1 పరీక్షలనూ ఆరు పేపర్లతో పెట్టాలని ఉత్తర్వులిచ్చారు. అప్పటికే పేపర్ల ప్రింటింగ్ పూర్తయిందని డీసీఈబీ ఆఫీసర్లు ఆందోళన చేపట్టగా, 11  పేపర్లతోనే నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. పరీక్షా తేదీలనూ ఉప ఎన్నిక అంశాన్ని మరిచి ప్రకటించి, ఆ తర్వాత కొన్ని జిల్లాల్లో వేరే షెడ్యూల్ ఇచ్చారు.

 దీపావళి మరుసటి రోజు స్కూళ్లలో లోకల్ హాలీడే తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చారు. వర్షాలతో చాలా రోజులు వర్కింగ్ డేస్ పోయాయి. ఈ నేపథ్యంలో సెలవు ఇచ్చే అధికారం ఎంఈవోలకు లేదని ప్రకటించారు. 
  ఇక దసరా సెలవులనూ కోత పెట్టాలని చూశారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు కాకుండా, అక్టోబర్ 1 నుంచి 9 వరకు ఇవ్వాలని ప్రపోజల్స్ రెడీ చేశారు. బతుకమ్మ పండుగకు సెలవు కోతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం కావడంతో అవి ప్రపోజల్స్ అంటూ అధికారులు వెనక్కి తగ్గారు.

 టెన్త్ పరీక్షల్లో మార్పులపై కనీసం పేరెంట్స్, టీచర్లు, విద్యావేత్తల అభిప్రాయం తీసుకోకుండానే, 11 పేపర్ల నుంచి ఆరుకు తగ్గించారనే  విమర్శలు వినిపిస్తున్నాయి.