విచారణ సరే..చర్యలేవీ..జీసీసీలో అక్రమాల నివేదికలు బుట్టదాఖలు

విచారణ సరే..చర్యలేవీ..జీసీసీలో అక్రమాల నివేదికలు బుట్టదాఖలు

భద్రాచలం,వెలుగు : భద్రాచలంలోని  గిరిజన సహకార సంస్థలో జరిగిన అక్రమాలపై  నేటికీ  ఎలాంటి చర్యలు కనిపించడం లేదు.అక్రమాలపై ఐటీడీఏ పీవో గౌతమ్​ పోట్రు విచారణ చేయించి, నివేదికలు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్​కు  పంపి  నెలలు గడుస్తున్నా యి.  కానీ, ఇప్పటికీ సొమ్ము రికవరీపై ఎలాంటి స్పందన లేకపోవడంతో సర్వత్రా విమర్శులు వస్తున్నాయి. 

విచారణలో తేలినా... చర్యలు లేవు

గిరిజన సహకార సంస్థలో సుమారు రూ.1.84కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నాయి. ములకలపల్లిలోని జీసీసీ పెట్రోలు బంకులో రూ.94లక్షలను కాజేశారు.   ప్రస్తుతం ఆ పెట్రోలు బంకు మూతపడింది. గిరిజనులకు ఉపాధి పోయింది.  జీసీసీలోని కొందరు ఉద్యోగులే ఈ అక్రమాలకు బాధ్యులని విచారణలో తేలింది.  తమ బంధువులను ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులుగా బంక్​లో నియమించి వారి ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారు. ఇక ముష్టిగింజలను గిరిజనుల నుంచి కొనుగోలు చేసి జిల్లాలోని వివిధ గోడౌన్లలో నిల్వ ఉంచారు. వాటిని కార్పొరేషన్​ టెండర్​ ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండానే జీసీసీ ఉద్యోగులే ప్రైవేటు వ్యాపారులకు అమ్మేసుకున్నారు. ఈ అక్రమం విలువ రూ.70లక్షలు. గుండాలకు చెందిన ఓ సేల్స్ మెన్​కు ఆంధ్రాకు చెందిన ప్రైవేటు వ్యాపారి ముష్టిగింజలకు సంబంధించిన డబ్బు రూ.12లక్షలు చెక్కు రూపంలో అందించారు. 

 ఇంటి దొంగల చేతివాటం 

ఐటీడీఏ పరిధిలోని హాస్టళ్లు, గురుకులాలకు నిత్యావసర సరుకులను సరఫరా చేసేందుకు జీసీసీ గోడౌన్​లో వాటిని నిల్వ ఉంచింది. 2020–-22 మధ్య కరోనా కాలంలో హాస్టళ్లు మూతపడటంతో సరుకులు సరఫరా చేయలేదు. అవి పాడైపోయాయంటూ పారబోశారు. వాటి విలువ రూ.20లక్షలు ఉంటుంది. ఆ సరుకుల వివరాలను జీసీసీ ద్వారా గిరిజన సంక్షేమశాఖకు నివేదించాలి. ఆ తర్వాతనే పారబోయాలి. కానీ,  జీసీసీలో మాత్రం వాటిని దారిమళ్లించి సొమ్ము చేసుకొని,  పాడైపోతే పారపోశామని తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఈ సొమ్ము రూ.20లక్షలు రికవరీ చేయాలని విచారణాధికారులు సూచించారు. ఇలా జీసీసీలో ఇప్పటి వరకు రూ.1.84కోట్ల మేర జరిగిన అక్రమాలపై జరిపిన నివేదికలు గిరిజన సంక్షేమశాఖ వద్ద మూలుగుతున్నాయి. అక్రమార్కులు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. ప్రక్షాళన పేరుతో విచారణ చేయించిన గిరిజన సంక్షేమశాఖ కమిషనర్​ అక్రమార్కులపై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. 

పైరవీకారులతో బెంబేలు

  ఇటీవల జీసీసీలో కారుణ్య నియామకాలను చేపట్టారు. సుమారు 30 మందికి ఈపథకం కింద ఉద్యోగాలు వచ్చాయి. అయితే యూనియన్​ నాయకుడు ఒకరు గిరిజన సంక్షేమశాఖ మంత్రి ద్వారా తామే చేయించాలని, ఉద్యోగం వచ్చిన వారు రూ.2లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్​ చేస్తున్నారు. మా కుటుంబీకులు చనిపోతే నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు వచ్చాయని, డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కాగా పీఆర్​సీ చేయిస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ చేయిస్తామని కూడా భారీగా డబ్బులు వసూలు చేశారు. దీనిపై వారు యూనియన్​ నాయకులను నిలదీస్తున్నారు దీనిపై జీసీసీలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

60శాతమే జీతం.. ఉద్యోగుల బతుకు ఛిద్రం

జీసీసీలో కిందిస్థాయి ఉద్యోగులకు నేటికీ 60శాతమే జీతాలు ఇస్తున్నారు. కార్పొరేషన్​ నష్టాల్లో ఉందని సాకుగా చూపించి ఈ విధంగా తక్కువ వేతనాలు ఇవ్వడంతో బతుకు దుర్భరంగా మారింది. దీంతో ఇటీవల పాల్వంచ జీసీసీ డివిజన్​ ఆఫీస్​ పరిధిలో పనిచేసే ఉద్యోగులంతా ఐటీడీఏ పీవోను గౌతమ్​ పోట్రును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. హెడ్డాఫీసుల్లో ఉండే ఉద్యోగులు పూర్తి జీతాలు తీసుకుంటున్నారని, నిత్యం ఊళ్లలో తిరుగుతూ బిజినెస్​ చేసే తమకు మాత్రం 60శాతం ఇవ్వడం వల్ల కుటుంబం గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం, దమ్మపేట, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు డివిజన్ల పరిధిలో సుమారు 150 మంది జీసీసీఉద్యోగులకు ఈ సమస్య ఉంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో నడిచే గురుకులాలు, ఆశ్రమాలు, హాస్టళ్లకు జీసీసీ గతేడాది నిత్యావసర సరుకులు సరఫరా చేసింది. వీటికి సంబంధించిన బిల్లులు రూ.13కోట్లు ఐటీడీఏ నుంచి రావాలి.