బ్యారేజీల డ్యామేజీలపై ఏం చేద్దాం?.ఎన్డీఎస్ఏ కమిటీని కోరిన ఇరిగేషన్ శాఖ

బ్యారేజీల డ్యామేజీలపై ఏం చేద్దాం?.ఎన్డీఎస్ఏ కమిటీని కోరిన ఇరిగేషన్ శాఖ
  •       రిపేర్లకు సంబంధించి ఓ రిపోర్టు అందజేత
  •     డ్యామేజీల తర్వాత ఏం చర్యలు తీసుకున్నారని అధికారులపై కమిటీ ప్రశ్నల వర్షం 

హైదరాబాద్, వెలుగు: వర్షాకాలంలోపు బ్యారేజీల పునరుద్ధరణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కమిటీని ఇరిగేషన్​శాఖ కోరింది. శుక్రవారం జలసౌధలో మూడోరోజూ కమిటీ విచారణ కొనసాగింది. ఇరిగేషన్​శాఖ సెక్రటరీలు రాహుల్​బొజ్జా, ప్రశాంత్​జీవన్​పాటిల్, ఈఎన్సీలు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం), స్టేట్​డ్యామ్​సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్​డీఎస్​వో), విజిలెన్స్​అధికారులతో కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా బ్యారేజీల పునరుద్ధరణకు ఏమేం చర్యలు తీసుకోవాలని కమిటీని అధికారులు అడిగినట్టు తెలిసింది. బ్యారేజీల రిపేర్లపై పది పాయింట్లతో ఈఎన్సీ అనిల్​కుమార్​ ఓ రిపోర్ట్​ను కమిటీకి ఇచ్చినట్టు సమాచారం. ఆ పనులు చేసుకునేందుకు అనుమతించాలని కమిటీని కోరినట్టు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలను సరిదిద్దేందుకు ఆపరేషన్స్​అండ్​మెయింటెనెన్స్​పనులు చేయించాల్సిందిగా కోరినట్టు సమాచారం. ‘‘ప్రవాహ దిశకు అనుగుణంగా అప్​స్ట్రీమ్​, డౌన్​స్ట్రీమ్​పైల్స్​లో బెంటోనైట్​సిమెంట్​తో కర్టెన్​ గ్రౌటింగ్​చేయించాలి. త్రీడీ మోడల్స్​ద్వారా అప్​స్ట్రీమ్​, డౌన్​ స్ట్రీమ్​లలో ప్రవాహానికి అడ్డంగా ఉండే అవుట్​క్రాఫ్ట్​రాక్​(ఓఆర్)లను తొలగించాలి. బ్యారేజీలపై వరద ఒత్తిడిని తగ్గించేందుకు ఎగువన నదిపై రెగ్యులేటరీలను నిర్మించాలి. వానాకాలంలో గేట్లన్నీ తెరిచే ఉంచాలి. మేడిగడ్డలో బ్లాక్​7లో గేట్లను తొలగించాలి. కుంగిన ఆ బ్లాకులో స్టీల్​షీట్​పైల్స్ మరిన్ని పెట్టాలి. బ్యారేజీల్లో ఎగువ, దిగువన ఉన్న ఇసుక మేటలను తొలగించాలి. బ్యారేజీల గేట్ల నిర్వహణను స్కాడా (సూపర్​వైజరీ కంట్రోల్​అండ్​డేటా ఆక్విజిషన్​) ద్వారా చేయాలి’’ అని నివేదికలో ఈఎన్సీ పేర్కొన్నట్టు తెలిసింది. 

రన్నింగ్​మోడల్స్​పరిశీలన

రాజేంద్రనగర్​లోని ఇంజనీరింగ్ ​రీసెర్చ్​ ల్యాబ్​లో బ్యారేజీల రన్నింగ్​ మోడల్స్​ను కమిటీ పరిశీలించింది. మూడు బ్యారేజీల ఆపరేషన్ల గురించి తెలుసుకున్నది. బ్యారేజీలపై మరింత విచారించాల్సిన అవసరం ఉందని అయ్యర్ ​చెప్పారు. విచారణ ఇంకా పూర్తికాలేదన్నారు. అయితే, మీటింగ్​మళ్లీ త్వరలోనే పెడతారా? లేదా? అన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

మీరేం చర్యలు తీసుకున్నరు? 

మేడిగడ్డ బ్యారేజీ కుంగినంక, అన్నారం బ్యారేజీకి బుంగలు పడిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను కమిటీ చైర్మన్​చంద్రశేఖర్​అయ్యర్ ప్రశ్నించినట్టు తెలిసింది. డ్యామేజీ తర్వాత ఏవైనా కమిటీలు వేసి విచారణ జరిపించారా? వర్షాకాలంలో వరద వస్తే పరిస్థితేంటన్న దానిపై రిపోర్ట్​తయారు చేయించారా?  ఆపరేషన్​అండ్​మెయింటెనెన్స్ పై ఏం చర్యలు తీసుకున్నారు? అని ఆయన అడిగినట్టు సమాచారం. అయితే 2024 వరకు బ్యారేజీల మెయింటెనెన్స్​బాధ్యత నిర్మాణ సంస్థలదేనని, దీంతో తమకు ఎలాంటి రిపోర్టులూ అందలేదని అధికారులు బదులిచ్చినట్టు తెలిసింది. బ్యారేజీల డిజైన్లను మధ్యలో ఏమైనా మార్చారా? లోపాలను గుర్తించకుండానే బ్యారేజీలు బాగున్నట్టు సర్టిఫై చేశారా? అని అధికారులపై అయ్యర్ ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, సమావేశానికి విజిలెన్స్ అధికారులను పిలిపించి.. వారి దగ్గరున్న డిజైన్లు, బ్యారేజీల డ్యామేజీపై వారు తయారు చేసిన రిపోర్టును కమిటీ పరిశీలించింది.