
- అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
- ఆ ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినం
- మహారాష్ట్రతో సంప్రదింపులకు సమావేశాన్ని ఏర్పాటు చేయండి
- వివిధ ప్రాజెక్టుల పనులను వేగంగా చేయండి.. చేతల్లో చూపించండి
- సమ్మక్కసాగర్నీటి కేటాయింపులపై ఫోకస్ పెట్టాలి
- ఎన్‌డీఎస్‌ఏ సిఫార్సుల మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు రిపేర్లు
- ఈసారి కృష్ణా ట్రిబ్యునల్ వాదనలకు వీలైతే సీఎం కూడా వస్తరని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మించి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించి తీరుతామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి వెంటనే రివైజ్డ్ డీపీఆర్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇక ఆలస్యం చేయకుండా ముసాయిదా ప్రతిపాదనలను తయారు చేయాలన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు మీటింగ్ షెడ్యూల్‌ను త్వరగా ఖరారు చేయాలని ఆదేశించారు. సోమవారం జలసౌధలో అధికారులతో దాదాపు రెండున్నర గంటలపాటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, ట్రిబ్యునల్ వాదనల నుంచి వివిధ ప్రాజెక్టు పనుల పురోగతి, ప్రాజెక్టుల్లో పూడికతీత, భూసేకరణ, దెబ్బతిన్న కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణలాంటి అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు.
అన్ని ప్రాజెక్టుల పనులను వేగంగా చేపట్టాలని, మాటల్లో కాకుండా చేతల్లో ఫలితాలు చూపించాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ వస్తే అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతుందని, కాబట్టి మన ఫలితాలే మాట్లాడాలని స్పష్టం చేశారు. సమ్మక్కసాగర్ బ్యారేజీకి నీటి కేటాయింపులపై ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 23న ఢిల్లీలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ).. నీటి కేటాయింపులపై టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) మీటింగ్నిర్వహించనుందని పేర్కొన్నారు.
కాబట్టి దానికి అధిక ప్రాధాన్యమివ్వాలని ఆయన సూచించారు. ఇందుకు సంబంధించి ఆయకట్టు వివరాలు, సిమ్యులేషన్ స్టడీస్ రిపోర్టు, చత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి ఎన్వోసీలను త్వరగా సమర్పించాలని ఆదేశించారు. సీతారామసాగర్, మోడికుంటవాగు, చనకా– కొరాటా డిస్ట్రిబ్యూటరీలు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ అప్లికేషన్లను వారంలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వీటిని త్వరగా పూర్తి చేస్తే కేంద్రం నుంచి పీఎం కృషి సించాయి యోజన కింద నిధులు పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కొడంగల్ లిఫ్ట్ భూసేకరణ పూర్తి చేయాలి
పాలమూరు –రంగారెడ్డి, జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులనూ అధిక ప్రాధాన్య ప్రాజెక్టులుగా పరిగణించాలన్నారు. ఈ ప్రాజెక్టులతోపాటు డిండి, ఎస్ఎల్‌బీసీ, పెండ్లిపాకల, నక్కలగండి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని ఆర్ అండ్ ఆర్ కమిషనర్‌ను ఆదేశించారు. కొడంగల్– నారాయణపేట లిఫ్ట్ భూసేకరణ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. జూరాల ప్రాజెక్టుకు కొత్త బ్రిడ్జిని నిర్మించే ప్రతిపాదనలు వేగంగా సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. కొత్త బ్రిడ్జి నిర్మిస్తే ఇప్పుడున్న బ్రిడ్జికి ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. తదుపరి చర్యలు తీసుకునేందుకు త్వరలో ఆ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. దేవాదుల ప్రాజెక్టులోని ప్యాకేజీ 6, ప్యాకేజీ 3 పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వచ్చే కేబినెట్ సమావేశం నాటికి ప్రోగ్రెస్ రిపోర్టును సమర్పించాలని ఆదేశించారు.
ప్రాజెక్టుల్లో పూడికతీతను చేపడుతున్న తొలి రాష్ట్రం మనదేనన్నారు. ఇప్పటికే మిడ్‌మానేరు, కడెం ప్రాజెక్టుల్లో పూడికతీత పనులు చేపట్టబోతున్నట్టు తెలిపారు. వాటితోపాటు జూరాల, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ, నిజాంసాగర్, హుస్సేన్‌సాగర్ తదితర ప్రాజెక్టుల్లోనూ పూడికతీత పనులపై దృష్టి పెట్టాలన్నారు. పూడికతీత ద్వారానే ప్రభుత్వానికి అదనంగా మరో రూ.500 కోట్ల ఆదాయం సమకూరుతుందని, అన్ని ప్రాజెక్టులకూ దానిని విస్తరింపజేస్తే రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల దాకా ఇన్‌కం వస్తుందని చెప్పారు.
హెలిబార్న్ సర్వే ఎంత వరకొచ్చింది
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు వద్ద చేపట్టాల్సిన హెలిబార్న్ సర్వేపైనా మంత్రి ఉత్తమ్ రివ్యూ చేశారు. అందుకు సంబంధించి ఎన్‌జీఆర్‌ఐ, హిమాలయన్ హెలీ సర్వీసెస్, జేపీ అసోసియేట్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఏరియల్ మ్యాగ్నెటిక్ సర్వే పనుల అరెంజ్‌మెంట్స్ ఎంతవరకు వచ్చాయని ఆరా తీశారు. అక్కడ ఇప్పటికే రెండు హెలిప్యాడ్స్ సిద్ధం చేశారని మంత్రికి అధికారులు వివరించారు. డీజీసీఏ నుంచి అనుమతులు వచ్చేలోపు అక్కడి నేల పరిస్థితులపై స్టడీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పనుల్లో అలసత్వం వహించొద్దని, సెక్రటరీ అయినా.. తన వద్దనైనా ఏదైనా పని ఆలస్యమవుతుందనిపిస్తే వెంటనే దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
ఈసారి వాదనలకు నేనూ వస్త
కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ –2లో 23 నుంచి 25 వరకు నీటి పంపకాలపై మరో దఫా వాదనలు జరగనుండటంతో.. ఆ వాదనలకు తాను హాజరవుతానని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. షెడ్యూల్ అనుకూలిస్తే సీఎం రేవంత్ కూడా వస్తారని చెప్పారు. ట్రిబ్యునల్ వాదనలు కొనసాగుతున్న తీరుపై.. సుప్రీంకోర్టు అడ్వకేట్ సి.ఎస్. వైద్యనాథన్‌ను అడిగి తెలుసుకున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) సిఫార్సుల ప్రకారమే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. నిర్మాణ పరీక్షలకు ఐఐటీలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలకు బాధ్యతలు అప్పగించాలని, వరదలు తగ్గుముఖం పట్టే నాటికి యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.