
- ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర హక్కులను వదులుకోం: ఉత్తమ్
- ఏపీ, కర్నాటక, మహారాష్ట్రలో ఎవరు అధికారంలో ఉన్నా ఫైట్ చేస్తం
- కేసీఆర్ పదేండ్లలో కాళేశ్వరం పేరుతో ఏ ప్రాజెక్టునూ పట్టించుకోలే
- గడువులోగా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఏపీ చేపడ్తున్న పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్, కర్నాటకలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రలో బీజేపీ, ఏపీలో టీడీపీ.. ఇలా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరిలో నీటి వాటాల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని చెప్పారు.
త్వరలోనే మహారాష్ట్రకు వెళ్తున్నామని, ఆ ప్రభుత్వంతో చర్చిస్తామని పేర్కొన్నారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో మీడియాతో ఉత్తమ్ చిట్‌చాట్ చేశారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామన్నారు. ‘‘పదేండ్లలో కేసీఆర్ చేసిందేమీ లేదు. ఆయన కాళేశ్వరం పేరుతో మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కాళేశ్వరం నీళ్లు లేకున్నా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నాం” అని తెలిపారు.తన శాఖ, తన జిల్లా అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టానన్నారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలూ లేవని, మంత్రులు సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు.
గడువులోగా దేవాదుల..
దేవాదుల ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. పెండింగ్ పనులకు ఉన్న అడ్డంకులను తొలగిస్తామన్నారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రాజెక్టులపై ఆ జిల్లా మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలతో కలిసి ఉత్తమ్ సమీక్ష చేశారు. ఇప్పటిదాకా దేవాదుల ప్రాజెక్టుతో 3.17 లక్షల ఎకరాల ఆయకట్టును సృష్టించామని ఆయన చెప్పారు. ‘‘దేవాదుల ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటి వరకు రూ.14,269.63 కోట్లు ఖర్చు చేశాం.
ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మరో రూ.4,230 కోట్లు కావాల్సి ఉంటుంది. 2,430.82 కిలోమీటర్ల ఎర్త్వర్క్లో భాగంగా ఇప్పటి వరకు 1,663.10 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. 1,202.14 కిలోమీటర్ల మేర కెనాల్ లైనింగ్ పూర్తి చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 800 కిలోమీటర్ల లైనింగ్పూర్తయింది. దేవాదుల ఫేజ్1 కింద 5.18 టీఎంసీలను ఎత్తిపోస్తూ 1.23 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇస్తున్నాం. ఫేజ్2 కింద 7.25 టీఎంసీలు లిఫ్ట్చేస్తూ 1.93 లక్షల ఎకరాలకు నీళ్లను అందిస్తున్నాం.
ఫేజ్3లో 25.75 టీఎంసీలు లిఫ్ట్ చేసి 2.39 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం. ఫేజ్3లోని ప్యాకేజ్ 1, 2 పనులు పూర్తవ్వగా.. ఇంకొన్ని పనులను చేపట్టాల్సి ఉంది. ప్రాజెక్టు కోసం 34,386 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా.. 32,079 ఎకరాలను సేకరించాం. ఇంకా 2,307 ఎకరాలు సేకరించాల్సి ఉంది” అని వెల్లడించారు.