
- ఇవాళ మిగతావి కూడా అందజేసే అవకాశం
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద కొనసాగుతున్న రిపేర్లు
- జియోటెక్నికల్టెస్టులను మొదలుపెట్టిన సీడబ్ల్యూపీఆర్ఎస్
- సీస్మిక్ టెస్టుల కోసం
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీపై ఇరిగేషన్ శాఖలోని దాదాపు అన్ని విభాగాలూ కాళేశ్వరం జుడీషియల్ కమిషన్‌కు అఫిడవిట్లు సమర్పించినట్లు తెలిసింది. ఇప్పటికే అన్ని విభాగాల అధికారులను కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ విచారించారు. డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్, ఓ అండ్ఎం, ఎస్డీఎస్ఓ, హైడ్రాలజీ తదితర విభాగాల అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఈనెల 27 లోపు అఫిడవిట్ల రూపంలో వివరాలు ఇవ్వాలని వారిని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఒకటి రెండు విభాగాలు తప్ప మిగతా అన్ని శాఖల అధికారులు అఫిడవిట్లు సమర్పించినట్లు సమాచారం. గురువారం స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ) అధికారులు అఫిడవిట్లు సమర్పించారు. సేఫ్టీ సేఫ్టీ ప్రొటోకాల్ వివరాలను అందజేశారు. బ్యారేజీ నిర్మాణం మొదలు కుంగిపోయే దాకా జరిగిన పరిణామాలను ఆ అఫిడవిట్లలో వివరించినట్లు తెలిసింది. బ్యారేజీ నిర్మాణానికి ముందు చేసిన ఇన్వెస్టిగేషన్లు తదితర వివరాలను అందజేశారు. బ్యారేజీలో కుంగిన 20వ పిల్లర్ కింద ఏర్పడిన భారీ గొయ్యిలో గ్రౌటింగ్ చేస్తున్న విధానాలను కూడా అఫిడవిట్లో పొందుపరిచారు. కాగా, శుక్రవారం కూడా కొందరు అధికారులు అఫిడవిట్లు సమర్పించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కొనసాగుతున్న టెస్టులు
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల వద్ద సెంట్రల్ వాటర్ పవర్ రిసర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) జియోటెక్నికల్ ఎంక్వయిరీ కొనసాగుతోంది. టెస్టుల్లో భాగంగా బ్యారేజీకి దిగువన, ఎగువన భూకంప ప్రభావాలను తెలుసుకునే సీస్మిక్ ఇన్వెస్టిగేషన్స్‌ను సంస్థకు చెందిన నిపుణులు చేస్తున్నారు. ప్రతి పిల్లర్ వద్ద 25 మీటర్ల లోతులో బోర్ హోల్స్ తవ్వి కేసింగ్ వేసే పనులను చేయిస్తున్నారు. ఆ పనులు పూర్తికాగానే ఆయా చోట్ల సీస్మిక్ అనాలిసిస్‌ను సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చెందిన సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రిసర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణులు అక్కడి నేల పరిస్థితులపై పరీక్షలు చేశారు. రిపోర్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. అయితే, సీడబ్ల్యూపీఆర్ఎస్ టెస్టులకు ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉండడంతో రిపోర్ట్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి జులై 7 నాటికి ఫుల్ రిపోర్ట్ ఇవ్వాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ని కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే ఆదేశించారు. అయితే, సీడబ్ల్యూపీఆర్ఎస్, సీఎస్ఎంఆర్ఎస్ నివేదికలు వచ్చాకే వాటిని పరిశీలించి బ్యారేజీల వద్ద పరిస్థితిపై నివేదిక ఇస్తామని ఎన్డీఎస్ఏ అధికారులు చెబుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే జులై 7 వరకు ఎన్డీఎస్ఏ రిపోర్టు సిద్ధమవ్వడం అనుమానంగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెల తొలి వారంలో జస్టిస్ ఘోష్ మరో దఫా విచారణ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
పనులకు ఇంకో వారం
మేడిగడ్డ సహా మూడు బ్యారేజీల వద్ద పనులు చకచకా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మరో వారంలో పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే షీట్‌పైల్స్ రీప్లేస్మెంట్ జరిగిందని, గ్రౌటింగ్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెప్పారు. కొట్టుకుపోయిన సీసీ బ్లాకుల స్థానంలో కొత్త సీసీ బ్లాకులను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే గేట్లన్నింటినీ ఓపెన్ చేసి పెట్టారని, గేబియన్ వాల్స్ ప్రొటెక్షన్ పెట్టి పనులు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. వరదలు మొదలయ్యే నాటికి బ్యారేజీకి తాత్కాలిక రిపేర్లు పూర్తవుతాయని స్పష్టం చేశారు.