నీరు లేక ఎండిపోతున్న వేలాది ఎకరాల పంటలు

నీరు లేక ఎండిపోతున్న వేలాది ఎకరాల పంటలు

ఖమ్మం, వెలుగు: ప్రస్తుత యాసంగి సీజన్​లో వేసిన పంటలకు సాగునీరు సరిపోయేలా అందడంలేదు. అందుకు ఇరిగేషన్​అధికారులు, సిబ్బంది సమన్వయలోపమే కారణం. జిల్లాలో సాగర్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రాజెక్టులో నీరున్నా పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 22 వేల ఎకరాలు సాగుచేస్తున్న రైతులు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రధానంగా సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాల్లో వరి, మక్క పంటలకు నీళ్లందక ఎండిపోతున్నాయి. పొలాలు నెర్రెలు బారుతుండగా, మక్క పూర్తిగా కంకులు వేయడంలేదు. దీనికి జిల్లా, డివిజన్​ అధికారుల నిర్లక్ష్యం, కిందిస్థాయిలో సిబ్బంది కొరతే కారణమని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 

లైట్ తీసుకున్న ఉన్నతాధికారులు..

నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలో సాగర్​ఎడమ కాల్వ కింద ఆయకట్టు ఉంది. ఆయా జిల్లాల్లోని చీఫ్ ఇంజినీర్లు ఎవరికి వారు తమ జిల్లాల్లో పంటలకు నీరందితే చాలు అనుకోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ మూడు జిల్లాల సీఈలతో సమన్వయం చేయాల్సిన ఉన్నతాధికారులు లైట్ తీసుకుంటున్నారు. ఆయకట్టు ముందున్న తూములు, కాల్వల ద్వారా నీరు వృథాగా పోవడం, చివరలో ఉన్న భూములకు నీరందకపోవడం వంటి సమస్యలు వచ్చాయంటున్నారు. 

21.50 టీఎంసీల నీటి విడుదల లక్ష్యం..

ఈ యాసంగిలో మార్చి 31 వరకు వారబందీ విధానంలో పంటలకు 21.50 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలోని17 మండలాల్లో 8 విడతలుగా 87 రోజులపాటు నీరు వదలాలని ప్లాన్ చేశారు. అయితే రిజర్వాయర్​మొదట్లో ఉన్న పాలేరుతోపాటు చివరాయకట్టు ఉన్న సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాల్లో ఒకే విధంగా నీటిని సప్లై చేస్తున్నారు. దీంతో చివరి తూములకు నీళ్లందడంలేదు. ఇక కిందిస్థాయి సిబ్బంది కొరత కూడా ఈ తిప్పలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి 1500 ఎకరాల ఆయకట్టు పర్యవేక్షణ కోసం ఒకరు, రెగ్యులేటర్ కు ఇద్దరు, ప్రధాన, బ్రాంచ్​కాల్వల్లో ప్రతి ఆరు కిలోమీటర్లకు ఒక లష్కర్ చొప్పున ఉండాలి. జిల్లాలోని ఆయకట్టు ప్రకారం సుమారు 700 మంది లష్కర్లు ఉండాలి. ప్రస్తుతం 102 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది రిటైరయ్యేందుకు దగ్గరున్నవారే. పదిహేనేళ్లుగా లష్కర్ల నియామకం లేక ఈ పరిస్థితి ఏర్పడింది. ఇక 60 మంది వర్క్ ఇన్ స్పెక్టర్లకు సగం మందే ఉన్నారు. 

జిల్లాలో పర్యటించిన ఈఎన్​సీ..!

జిల్లాలో సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో పరిస్థితిని క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు సోమవారం రాష్ట్ర ఇరిగేషన్ చీఫ్​ఇంజినీర్(ఆపరేషన్స్ అండ్​మెయింటనెన్స్) నరేంద్ర కుమార్​జిల్లాలో పర్యటించారు. పాలేరు రిజర్వాయర్​లో నీటిని పరిశీలించడంతోపాటు సత్తుపల్లి పరిధిలోని వివిధ మండలాల్లో పర్యటించి ఎండిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. 

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్వయంగా ఆయన వెంట ఉండి రైతుల ఇబ్బందులను వివరించారు. ప్రాజెక్టు నుంచి మూడు వేల క్యూసెక్కుల నీరు మాత్రమే పాలేరు రిజర్వాయర్ కు చేరుతుందని, మిషన్ భగీరథ అవసరాలు పోను సాగునీరు రెండున్నర వేల క్యూసెక్కులే కేటాయించి వారబందీ పద్ధతిలో విడుదల చేయడంతో చివరాయకట్టుకు నీరు అందడం లేదని చెప్పారు. రానున్న ఇరవై రోజులపాటు వరి, మక్క పంటలకు అందకపోతే అవి ఎండిపోయే అవకాశం ఉందని వివరించారు. నీటి విడుదలను ఐదు వేల క్యూసెక్కులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈఎన్​సీ మాట్లాడుతూ పంటలు ఎండిపోకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇరిగేషన్ అధికారులు ఇరవై రోజులు సమన్వయంతో రైతులకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.