విలువల కొలమానం కవి, గాయకులకేనా?

విలువల కొలమానం కవి, గాయకులకేనా?

సంప్రదాయ రాజకీయ పార్టీల్లో విలువలు వెతకడం అంటే నేతి బీరకాయలో నెయ్యి వేతకడం లాంటిదే. ప్రజల వైపు నిలబడే రాజకీయాలకు, కవిత్వానికి, రచనలకు, గేయాలకు పురుడు పోసిన తెలంగాణలో  ప్రజలవైపు నిలబడటం అనేది  ఒక ఫ్యాషన్ గా కొనసాగిన కాలం. పాలకుల తూటాలకు, లాఠీలకు ఎదురొడ్డి నిలబడి, కలబడి పోరుజేసిన కాలాన్ని, చరిత్రను తెలంగాణ నమోదు చేసుకుంది. పాట పాడినందుకే గద్దర్ పై తూటా దిగింది. బెల్లి లలితమ్మ 16 ముక్కలుగా కోయబడ్డది.  డప్పు విన్యాసంతో డప్పుల దరువేసిన ముక్క కరుణాకర్​ను రాజ్యం పోషించిన నయీమ్ గుండాల చేతిలో హత్య చేయబడ్డాడు. తెలంగాణ గొంతెత్తిన తొర్రర్ ఐలయ్య ఎన్​కౌంటర్ చేయబడ్డాడు. కత్తుల వంతెనలపై కవాతు చేసిన చరిత్ర తెలంగాణ కవి, గాయకులది.  మలిదశ తెలంగాణ ఉద్యమకాలమంతా నిర్బంధంలో మెదిలింది కవి, గాయకులు మాత్రమే. 

సినిమాలు పాస్ ఐతే, హీరోలు ఫెయిల్ ఐతే, జీరోలుగా చూసే సగటు ప్రేక్షకుడిలా  కవులు కళాకారులను చూడటం  విచిత్ర పరిణామం.  జనం కోసం.. తనకు తానే  ఒంటరైన కవి గాయకులెందరో! తన చైతన్యంతో వచ్చిన మార్పులు, ముఖ్యంగా గ్లోబలైజేషన్ తరువాత వచ్చి పడిన మార్కెట్ సంస్కృతి అన్ని రంగాల పై పడ్డట్టు, పీడిత ప్రజల వైపు నిలబడే రాజకీయాలపై కూడా పడింది. చీలికలు, పేలికలు, వ్యక్తిగత ఆధిపత్య పోరు  కులం, వర్గంపై పెద్ద ఎత్తున చర్చ అంతా కూడా సీరియస్ పీడిత ప్రజల ఉద్యమాలను పురోగమనం వైపు కాకుండా, తిరోగమనం వైపు నడిపించింది. దాని  మూల్యమే తెలంగాణ గడ్డ పై నెలకొన్న భావ దారిద్ర్యం. సిద్ధాంతాలు, సూత్రాలు చెప్పిన మేధావులే తమ దారి తాము చూసుకుంటున్నప్పుడు పాడెటోంది, ఆడెటోంది లెక్కేంది? ఏం పిల్లడో ఎల్దాం వస్తవ అని ఉత్తరాంధ్ర  వంగపండు గోస ఎవరన్నా విన్నరా? ఆయన కుమార్తె ఉషని ఎవరైనా అక్కున చేర్చుకున్నరా? తీవ్ర అనారోగ్యంలో కూడా ఆడి పాడిన గద్దర్ ని ఎంత మంది ఓదార్చినారు?  ఏడు పదుల వయస్సులో కూడా కోర్ట్ పేషీలకు తిరుగుతూ అప్పుల పాలు అయిన గద్దర్​కు ఎంతమంది సహాయం  చేశారు? ఎవడి పాలు అయ్యిందిరో తెలంగాణ అని గానం చేసిన ఏపురికి ఎంతమంది అండగా నిలిచారు? తెలంగాణ నిప్పుల వాగును  పారించిన అందెశ్రీ  ఎంతమందికి యాదిలో ఉన్నడు? కాలికి గజ్జె కట్టి  దరువేసిన విమలమ్మను యోగ క్షేమాలు అడిగే దిక్కు ఉన్నదా?  రాజకీయాలను కాలమే నడుపుతోంది. కాలంతో పయనించేవాడే కవి,రచయిత, నాయకుడు ఎవరన్నా కావచ్చు. ఆకుల భూమయ్య అమరత్వం ఎంతమంది మననం చేస్తున్నారు? పాశం యాదగిరిని పరామర్శిస్తున్నారా? విప్లవ సంస్థ నిబంధనలను విప్లవ విలువలను ఆ సంస్థల నుండి బయటికి వచ్చిన వారికి సైతం ఆపాదిస్తూ  వారికి జీవిత కాలపు నిర్బంధ విలువలను  అంట గడుతూ దుర్మార్గపు థాట్ పోలీసింగ్ కు పాల్పడటం దారుణమైన విషయం. 

వసంతాలూ వస్తాయి!

కవులు, కళాకారులుగా గౌరవాలు, సన్మానాలు అందుకోవడం వారి హక్కు . దాన్ని  ఎవరూ కాలరాయలేరు.  సి. నారాయణ రెడ్డి, కాళోజీ నారాయణరావు, కైకాల సత్యనారాయణ ఇంకా అనేక మంది పద్మశ్రీ, పద్మ భూషణ్  సన్మానాలు అందుకున్నట్టు, వీరు వారికి నచ్చిన పార్టీలు మారే హక్కు లేదా?  మనం మాత్రం నష్టపోకూడదు, అవతలి వాడు సకల దరిద్రాలను మూటగట్టుకోవాలన్న ఆధిపత్య భావజాలం నుంచి బయట పడనంత కాలం, తాలు విత్తనాలుగా చలామణి అవుతూనే ఉంటాయి. వసంత మేఘ గర్జనలు, ఉద్యమాల  ఉరుములు, వాతావరణం మార్పులు రానంత కాలం పుట్టలో ఉండవలసిన కోడె నాగులు కూడా బుట్టలోకి జారుకుంటాయి. ఆకు రాలు కాలమే కాదు, వచ్చే వసంతాన్ని కూడా ఎవరూ ఆపలేరు. ఎందుకంటే అది కాలం నేర్పిన ప్రకృతి ధర్మం.

- దొమ్మాట వెంకటేశ్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్