ఎప్పుడూ వాయిదాలేనా.. కౌంటర్‌‌ దాఖలు చెయ్యరా: హైకోర్టు

ఎప్పుడూ వాయిదాలేనా.. కౌంటర్‌‌ దాఖలు చెయ్యరా: హైకోర్టు
  • జీవో 84 జారీ కేసులో రాష్ట్ర సర్కార్‌‌పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: నోటరీతో కొనుగోలు చేసిన స్థలాల క్రమబద్ధీకరణ జీవో 84ను సవాల్‌ చేసిన కేసులో ప్రభుత్వం కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల గడువు ఇచ్చాక కూడా కౌంటర్‌ వేయకుండా మళ్లీ గడువు కోరడం ఏంటని ప్రశ్నించింది. జీవో 84ను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని నిలదీసింది. నోటరీతో కొనుగోలు చేసిన స్థలాల క్రమబద్ధీకరణకు వీలు కల్పిస్తూ జులై 26న ప్రభుత్వం జారీ చేసిన జీవో 84ను కొట్టేయాలని కోరుతూ భాగ్యనగర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌ పిల్‌ను దాఖలు చేశాడు. 

ఈ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌ కుమార్‌ల డివిజన్‌ బెంచ్‌ విచారించింది. కౌంటర్‌ దాఖలుకు మరో 3 వారాల గడువు కావాలని ప్రభుత్వ లాయర్‌‌ కోరడంతో హైకోర్టు ఫైర్‌‌ అయింది. ఇది చాలా తీవ్రమైన విషయమని, ఒక వారమే గడువు ఇస్తున్నామని, ఇదే లాస్ట్‌ చాన్స్‌ అని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.