విటమిన్లలో డి విటమిన్ శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి , మొత్తం ఆరోగ్యంపై దీని ప్రభావం ఉంటుంది. ఇది ముఖ్యంగా కాల్షియం, పాస్ఫేట్ లను ప్రేగులలో శోషణం చేసేందుకు ముఖ్యమైన విటమిన్. అయితే చాలామందికి డి విటమిన్ ఉన్న ఆహార పదార్దాలు గానీ, సప్లిమెంట్స్ గానీ ఏ మోతాదులో తీసుకోవాలి..ఏ టైంలో తీసుకోవాలి అనే అంశాలపై కొంత గందరగోళం ఉంటుంది. వారి సందేహం నిజమే..ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..మనం తీసుకునే విటమిన్ డి మోతాదు, తీసుకునే టైం కూడా వచ్చే ఫలితాలను ప్రభావం చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
విటమిన్ డి కొవ్వులో మాత్రమే కరుగుతుంది. నీటిలో కరగదు. ఈ అంశమే విటమిన్ డి ని ఏం టైంలో తీసుకోవాలి.. ఏ ఆహారంతో కలిపి తీసుకోవాలో చెబుతుంది. కొవ్వు భోజనంతో కలిపి విటమిన్ డి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. గింజలు, గుడ్లు, అలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారంతో విటమిన్ డి తీసుకుంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఖాళీ కడుపుతో డి విటమిన్ తీసుకుంటే దాని ప్రయోజనాలు తగ్గుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
విటమిన్ డిని రోజులో ఏ సమయంలో తీసుకోవాలి అనేది మరో సందేహం.. రాత్రి సమయం కంటే ఉదయం సమయంలో విటమిన్ డి ని తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలుంటాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. తక్కువ ప్రయోజనాలతో పాటు నిద్ర సమస్యకు దారి తీయొచ్చు. ఎందుకంటే నిద్రను నియంత్రించే హార్మోన్ మెలటోనిన్ ప్రభావితమై నిద్ర కు భంగం కలుగొచ్చంటున్నారు.
విటమిన్ డిని ఎంత మోతాదులో తీసుకోవాలి..
కాలాన్ని బట్టి శరీరంలో విటమిన్ డి స్థాయిలు మారుతుంటాయి. కాబట్టి డాక్టర్ సలహా ప్రకారం విటమిన్ డి డోస్ తీసుకోవాలి. వారానికోసారి, నెలకోసారి తీసుకోవారికి ఇది అంత ముఖ్యంగా కాదు. వయస్సు, శరీర బరువు, సూర్యరశ్మి లభ్యత, శరీరంలో విటమిన్ డి స్థాయిలు వంటి వ్యక్తిగత అంశాలను బట్టి డాక్టర్ల సలహా తో విటమిన్ డి తీసుకోవాలి. లేకుంటే కొవ్వుల మలాబ్జర్షన్ డిజార్డర్ , మూత్ర పిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

