
సైబరాబాద్ కమిషనరేట్లోని గచ్చిబౌలి, కూకట్పల్లి ,రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డ ముఠా సభ్యులు ఇషన్ నిరంజన్ నీలంనాలి(21),రాహుల్(19)లను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా ముందు ప్రవేశపెట్టారు. గుల్బర్గా నుంచి బైక్పై ఈనెల 22 న నగరానికి వచ్చిన ఇరానీ గ్యాంగ్ చైన్ స్నాచర్స్..25 న గచ్చిబౌలి, కూకట్ పల్లి, రామచంద్రపురంలలో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 26 న మియపూర్లో చైన్ స్నాచింగ్కు పాల్పడ్డట్లు వెల్లడించారు. అదే రోజు మియపూర్ నుంచి BHEL మీదుగా నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారని చెప్పారు.
చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు అన్ని పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేసి వెహికల్ చెకింగ్ నిర్వహించామని..ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ యాదయ్య ,కానిస్టేబుల్స్ థేబేస్, రవిలు నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ యాదయ్యపై స్నాచర్లు కత్తితో దాడి చేశారని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. అయినప్పటికీ నిందితులను పోలీసులు వదల్లేదన్నారు. ప్రస్తుతం యాదయ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని..ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. నిందితుల నుంచి తపంచ, 15 లైవ్ బుల్లెట్లు, రివాల్వర్, రెండు మొబైల్ ఫోన్ లు, ఒక బైక్ , రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకున్న పోలీసులను కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు.