ఈశ్వరీబాయి చరిత్ర నేటి యువతకుస్ఫూర్తి: జస్టిస్ నగేశ్

ఈశ్వరీబాయి చరిత్ర నేటి యువతకుస్ఫూర్తి: జస్టిస్ నగేశ్
  • ప్రొఫెసర్ ఎంఎన్ బూసికి ఈశ్వరీబాయి అవార్డు  

బషీర్ బాగ్, వెలుగు : ఈశ్వరీబాయి.. పేదల పక్షపాతి అని, ఆమె బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారని హైకోర్టు జడ్జి జస్టిస్ నగేశ్ భీమపాక అన్నారు. పేదల సమస్యలపై ఈశ్వరీబాయి అసెంబ్లీలో గళమెత్తి, వారికి సంక్షేమ పథకాలు అందించారని కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆమె జయంతి వేడుకలు నిర్వహించారు. దీనికి ట్రస్ట్ చైర్ పర్సన్ గీతారెడ్డి అధ్యక్షత వహించగా, జస్టిస్ నగేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈశ్వరీబాయి చరిత్రను నేటి యువతరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని, అది వారిలో స్ఫూర్తి నింపుతుందని అన్నారు. ‘‘విద్య ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయని భావించి, విద్యాసంస్థలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యను అందించిన మహనీయురాలు ఈశ్వరీబాయి. అసెంబ్లీలో పేదల పక్షాన గళమెత్తి, ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. ఆమె కృషి వల్లనే చెరువుల్లో చేపలు పట్టే హక్కు మత్స్యకారులకు దక్కింది. అప్పట్లోనే చదువుకునే ఆడ పిల్లలకు కాస్మొటిక్స్ కోసం నిధులు కేటాయించాలని అసెంబ్లీలో ఈశ్వరీబాయి లేవనెత్తి, జీవో విడుదల చేయించారు. మహిళల హక్కులు, దళితుల అభ్యున్నతికి ఈశ్వరీబాయి చేసిన సేవలు మరువలేనివి.

మహిళలు ఇంటికే పరిమితమైన రోజుల్లో ఈశ్వరీబాయి బయటకొచ్చి, సమాజాభివృద్ధి కోసం కృషి చేశారు” అని కొనియాడారు. పాలకులకు సేవాభావం, పేదలపై దయాగుణం, కరుణ లేకపోతే ప్రభుత్వ పథకాలు నిర్వీర్యమవుతాయని చెప్పి.. ప్రజల పక్షపాతిగా ఈశ్వరీబాయి నిలిచారని అన్నారు. ఆమె జీవిత చరిత్రపై సెమినార్లు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కాగా, కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎంఎన్ బూసికి ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డు-–2023 అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ సుబ్బారావు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ వినోద్ కుమార్, బుద్ధ వనం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, జేబీ రాజు తదితరులు పాల్గొన్నారు.