కదులుతున్న ఉగ్రడొంక..ఇస్లాం కోసమే ఐఎస్‌‌‌‌ఐ ముఠాలకు సహకరించా : ఆదిల్ ఖాన్

కదులుతున్న ఉగ్రడొంక..ఇస్లాం కోసమే ఐఎస్‌‌‌‌ఐ ముఠాలకు సహకరించా : ఆదిల్ ఖాన్

 

  • విచారణలో ఒప్పుకున్న ఐఎస్​ఐ సానుభూతిపరుడు ఆదిల్ ఖాన్
  • యూపీ సీఎం పీఏ నెంబర్ దొరక్కపోవడంతో మంత్రుల నెంబర్లు ఐఎస్‌‌‌‌ఐకి..
  • ఎఫ్ఐఆర్‌‌‌‌‌‌‌‌లో విస్తుపోయే విషయాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాకిస్తాన్ ​గూఢచార సంస్థ 'ఐఎస్‌‌‌‌ఐ' అనుమానిత సంబంధాల కేసులో మేడ్చల్‌‌‌‌లో అరెస్టయిన జాయిద్ ఖాన్ అలియాస్ ఆదిల్ ఖాన్ ఎఫ్‌‌‌‌ఐఆర్ రిపోర్టులో అత్యంత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్‌‌‌‌స్టాగ్రామ్ రీల్స్ క్రేజ్, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఉన్న ఆదిల్, ఐఎస్‌‌‌‌ఐ ముఠాలతో ఎలా చేతులు కలిపాడో  తెలిసింది. నిందితుడు 4వ తరగతి వరకు మాత్రమే చదివాడు. మొదట్లో కోల్‌‌‌‌కతాలోని ఒక బట్టల షాపులో పనిచేసి తర్వాత హైదరాబాద్‌‌‌‌కు వలస వచ్చాడు. ఇక్కడ వచ్చే రూ. 15,000 జీతం సరిపోక ఇన్‌‌‌‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం వైపు మళ్లాడు.

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దేశద్రోహ ముఠాలతో పరిచయం..

ఈ ఏడాది జనవరిలో ఆదిల్ ఖాన్ గన్ కోసం ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో సెర్చ్ చేశాడు. సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్​చేస్తూ తిరిగే అబిద్ జుట్టా, రానా హుస్సేన్‌‌‌‌లతో అతడికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరికీ పాకిస్తాన్‌‌‌‌కు చెందిన గ్యాంగ్‌‌‌‌స్టర్ సవాజాద్ భట్టితో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అబిద్ జుట్టా, రానా హుస్సేన్‌‌‌‌లు సోషల్ మీడియా వేదికగా పెద్ద నెట్‌‌‌‌వర్క్‌‌‌‌నే నడుపుతున్నట్లు విచారణలో తేలింది.

వీరు నిర్వహిస్తున్న ఒక వాట్సాప్ గ్రూపులో 833 మంది, మరో గ్రూపులో 276 మంది సభ్యులు ఉన్నట్లు వెల్లడైంది. "నాకు ఒక గన్ కావాలి" అంటూ జాయిద్ ఖాన్.. అబిద్, రానాలను సంప్రదించగా వారు షరతు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌‌‌‌లో అబిద్ జుట్టాకు సంబంధించిన పోస్టర్లు అంటిస్తే గన్ ఇస్తామని జాయిద్ ఖాన్‌‌‌‌కు ఆఫర్ చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పీఏ ఫోన్ నంబర్ కావాలని అతడిని ఆదేశించారు. సీఎం పీఏ నంబర్ కోసం ఇంటర్నెట్‌‌‌‌లో విస్తృతంగా వెతికిన నిందితుడు అది దొరక్కపోవడంతో, యూపీకి చెందిన పలువురు మంత్రుల ఫోన్ నంబర్లను సేకరించి వారికి చేరవేశాడు.

ఇస్లాం కోసమే చేశా..

నిందితుడు జాయిద్ ఖాన్‌‌‌‌ను విచారించగా నిజాలు ఒప్పుకున్నాడు. కేవలం డబ్బు కోసమే కాకుండా,  ‘ఇస్లాం కోసం పోరాడాలి’ అనే ఉద్దేశంతోనే తాను యూపీ మంత్రుల ఫోన్ నంబర్లను ఇంటర్నెట్‌‌‌‌లో సేకరించి, పాక్ సంబంధాలున్న ముఠాకు అందించినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు. ఈ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారణను మరింత తీవ్రతరం చేశారు.