దేశంలో ఇళ్ల అమ్మకాలు పడిపోయినా రేట్లు మాత్రం తగ్గట్లే.. రియల్టర్స్ మాయాజాలం

దేశంలో ఇళ్ల అమ్మకాలు పడిపోయినా రేట్లు మాత్రం తగ్గట్లే.. రియల్టర్స్ మాయాజాలం

దేశంలోని రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. సాధారణంగా డిమాండ్ తగ్గినప్పుడు ధరలు కూడా తగ్గుతాయి. ప్రస్తుత హోమ్ మార్కెట్‌లో అమ్మకాలు తగ్గుతున్నా.. ఇళ్ల ధరలు మాత్రం తగ్గడం లేదు సరే కదా.. పైగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇళ్ల మార్కెట్ ఒక విలక్షణమైన మలుపులో ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'జెఎమ్ ఫైనాన్షియల్' మార్చి 2026 నివేదించింది. 

2026 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 7% తగ్గాయి. గత ఏడాది డిసెంబర్‌లో నమోదైన 9.9% తగ్గుదలతో పోలిస్తే ఇది కొంత మెరుగైనప్పటికీ.. కొనుగోలుదారుల నుంచి ఆసక్తి ఇంకా పుంజుకోలేదని స్పష్టమవుతోంది. మార్కెట్‌లో డిమాండ్ నెమ్మదించడాన్ని గమనించిన బిల్డర్లు, డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఫలితంగా కొత్త ప్రాజెక్టుల లాంచ్‌లు ఏకంగా 17% మేర పడిపోయాయి.

ఇళ్ల ధరలు తగ్గకపోవడానికి అసలు కారణం అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య తగ్గడమే. మార్కెట్లో కొత్త ఇళ్ల సరఫరా భారీగా తగ్గడంతో, గతంలో మిగిలిపోయిన ఇళ్లు నెమ్మదిగా అమ్ముడవుతూ వచ్చాయి. దీనివల్ల అమ్ముడుపోని ప్రాపర్టీల సంఖ్య 5.1% మేర తగ్గిపోయాయి. మార్కెట్లో ఇళ్ల లభ్యత తక్కువగా ఉండటమే ధరల స్థిరత్వానికి కొండంత అండగా నిలిచింది. ఈ గట్టి పట్టు వల్లే దేశవ్యాప్తంగా రియల్టీ ప్రాపర్టీల ధరలు ఇప్పటికీ 6.6% వార్షిక వృద్ధిని నమోదు చేశాయి.

గత ఆర్థిక సంవత్సరంలో కనిపించిన 13.5% ధరల పెరుగుదలతో పోలిస్తే.. ఈ వేగం తగ్గిన మాట వాస్తవమే. త్రైమాసికం తర్వాత త్రైమాసికం ధరల వృద్ధి రేటు 12.5% నుండి 9.3%కి, ఇప్పుడు 6.6%కి క్రమంగా నెమ్మదించింది. ధరల్లో ఈ మార్పు కనిపిస్తున్నప్పటికీ.. అమ్మకాలు, లాంచ్‌లు పడిపోవటంతో ధరలు కుప్పకూలకుండా మార్కెట్ నిలబడటం విశేషం.

మొత్తంగా చెప్పాలంటే.. భారతదేశ హౌసింగ్ మార్కెట్ ప్రస్తుతం నియంత్రిత మందగమనం గుండా వెళుతోంది. అంటే మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడటానికి డిమాండ్ పుంజుకోవడం కంటే.. డెవలపర్లు సరఫరాను నియంత్రించడమే ప్రధాన కారణంగా మారింది. మరి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ వ్యూహం మార్కెట్‌ను ఎంతవరకు నడిపిస్తుందో చూడాలి.