టిఫిన్​ బాక్స్​ బాంబులతో పేలుళ్లకు కుట్ర ఆన్​లైన్​లో టిఫిన్​ బాక్సులు, వైర్లు, రిమోట్​సెల్స్​ ఆర్డర్

టిఫిన్​ బాక్స్​ బాంబులతో పేలుళ్లకు కుట్ర ఆన్​లైన్​లో టిఫిన్​ బాక్సులు, వైర్లు, రిమోట్​సెల్స్​ ఆర్డర్
  • అమ్మోనియం, సల్ఫర్, అల్యూమినియం కొనుగోలు
  • హైదరాబాద్​లో 3 రోజులపాటు మకాం వేసిన ఆరుగురు ఐసిస్ ​అనుమానిత టెర్రరిస్టులు
  • బోయిగూడలో 3  రోజులు మీటింగ్‌‌‌‌
  • ఏపీ రంపచోడవరంలో బ్లాస్టింగ్‌‌‌‌ రిహార్సల్స్‌‌‌‌
  • బ్లాస్టింగుల కోసం నలుగురు సభ్యులకు బాధ్యతలు
  • విజయనగరం పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌‌‌‌లో సంచలన విషయాలు
  • రంగంలోకి దిగిన ఎన్‌‌‌‌ఐఏ.. వివరాలుసేకరణలో నిమగ్నం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  హైదరాబాద్‌‌‌‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో  సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడ్డ ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్‌‌‌‌ఉర్‌‌‌‌ ‌‌‌‌రెహ్మాన్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌ బోయిగూడకు చెందిన సయ్యద్‌‌‌‌ సమీర్‌‌‌‌.. నగరంలో  భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇందుకోసం బోయిగూడలో మూడు రోజులు సమావేశం నిర్వహించినట్లు సమాచారం. బాంబుల తయారీ కోసం టిఫిన్‌‌‌‌ బాక్సులు, వైర్లు,రిమోట్‌‌‌‌ సెల్స్‌‌‌‌ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఆర్డర్ చేసినట్లు ఏపీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఏపీ రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు బాంబ్​ బ్లాస్టింగ్​ రిహార్సల్స్‌‌‌‌ నిర్వహించినట్లు గుర్తించారు. హైదరాబాద్‌‌‌‌లో డమ్మీ బ్లాస్టింగ్స్, ఆ తర్వాత వరుస పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో సమీర్‌‌‌‌‌‌‌‌, సిరాజ్‌‌‌‌ను  కౌంటర్ ఇంటెలిజెన్స్‌‌‌‌ శనివారం అరెస్ట్ చేసింది. విజయనగరం టూ టౌన్  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల రిమాండ్ రిపోర్ట్‌‌‌‌లో సంచలన విషయాలు వెల్లడించారు. మరింత సమాచారం రాబట్టేందుకు వారిని 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పూర్తి వివరాలు రాబట్టేందుకు నేషనల్​ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) కూడా రంగంలోకి దిగింది. ఎన్ఐఏ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ సోమవారం విజయనగం టూ టౌన్ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. ఎఫ్‌ఐఆర్​సహా నిందితులకు సంబంధించిన వివరాలు సేకరించారు.

సొంతంగా సంస్థ ఏర్పాటు

ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్‌ఉర్‌‌ రెహ్మాన్‌ (29), హైదరాబాద్‌ బోయిగూడ రైల్‌ కళారంగ్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ సమీర్‌‌ (28) హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. సమీర్‌‌ సికింద్రాబాద్‌లో లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సమీర్, సిరాజ్‌ ఇంజినీరింగ్‌ చదవుకుంటున్నపుడు ఐసిస్‌ సానుభూతిపరులుగా మారారు. ఈ క్రమంలోనే సౌదీ అరేబియాలోని పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన హ్యాండ్లర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో వారికి పరిచయం ఏర్పడింది. సౌదీలోని హ్యాండ్లర్ల సూచనలతో సమీర్‌‌, సిరాజ్‌ కలిసి  అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏహెచ్ఐఎం) ను ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రలోని ముస్లిం యువత, మైనర్లను టార్గెట్‌ చేశారు. ‘మ్యాజిక్ లాంతర్’ పేరుతో సోషల్‌మీడియా అకౌంట్‌ ఓపెన్ చేశారు. ఉగ్రవాద భావజాలంతో పోస్టులు చేసే వారిని ట్రాప్ చేసేవారు. సౌదీ హ్యాండ్లర్ల సూచనల మేరకు సిరాజ్, సమీర్‌ కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రూపులు ఏర్పాటు చేశారు.

3 రోజులు సమావేశం

 సిరాజ్‌ గత 6 నెలల వ్యవధిలో పలుమార్లు సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చాడు. హ్యాండ్లర్ల వద్ద  పేలుడు పదార్థాలను సేకరించడం, బాంబులు తయారు చేయడంపై శిక్షణ తీసుకున్నాడు. సమీర్‌‌తో పాటు కర్నాటక, మహారాష్ట్రకు చెందిన ఆరుగురు సభ్యులతో ప్రత్యేక టీమ్‌ తయారు చేశాడు. సిరాజ్‌ పేలుడు పదార్థాలు సేకరించేలా.. సమీర్‌ సోషల్‌మీడియా మానిటరింగ్‌తోపాటు టీమ్‌ మెంబర్లు షెల్టర్‌ ఇచ్చేలా బాధ్యతలు తీసుకున్నారు. కర్నాటక, మహారాష్ట్రకు చెందిన నలుగురితో ఇప్పటికే పలు ప్రాంతాలను గుర్తించినట్లు తెలిసింది. ఆయా ప్రాంతాల్లో డమ్మీ బ్లాస్టింగ్స్ చేయడంతోపాటు హైదరాబాద్‌లోనూ బాంబు పేలుళ్లకు రెక్కీ, రిహార్సల్స్‌ చేసేందుకు ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. హ్యాండ్లర్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత తమ ప్లాన్‌ను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. 

ఏపీలో పేలుడు పదార్థాల కొనుగోలు

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తే దొరికిపోతామనే  అనుమానంతో సిరాజ్‌.. ఏపీలోని రిమోట్‌ ఏరియాల్లో కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశాడు. గత నెలలో రంపచోడవరంలోని అటవీ ప్రాంతంలో పలుమార్లు బ్లాస్టింగ్‌ రిహార్సల్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లోనూ పేలుడు పదార్థాలు ఆర్డర్ చేశారు. పోలీసులకు అనుమానం రాకుండా అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం సహా పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు. ఆ తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆన్‌లైన్ సెర్చ్‌ ఆపరేషన్‌లో సిరాజ్‌, సమీర్‌  పట్టుబడ్డారు. దీంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తం అయ్యారు. సమీర్ నివాసం ఉండే బోయిగూడ పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టారు.  సమీర్‌‌తో కాంటాక్ట్​లో ఉన్న స్నేహితులు, సోషల్‌మీడియా ఫాలోవర్స్‌ వివరాలు సేకరిస్తున్నారు. ఏపీ పోలీసులతో కలిసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. నిందితులు ఇచ్చిన ప్రాథమిక సమాచారంతో పోలీసులు, ఎన్ఐఏ అధికారులు మిగతా నలుగురి కోసం గాలిస్తున్నారు, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే బాంబులు ఎక్కడెక్కడ పెట్టాలని రెక్కీ చేసిన విషయంతో పాటు ఇంకా అనేక కీలకమైన విషయాలు పోలీసులకు చిక్కే అవకాశం ఉంది.