కాశ్మీర్ ఫైల్స్ : ఇండియాకు క్షమాపణ చెప్పిన ఇజ్రాయెల్

కాశ్మీర్ ఫైల్స్ : ఇండియాకు క్షమాపణ  చెప్పిన ఇజ్రాయెల్

న్యూఢిల్లీ: కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్​ఇండియా) జ్యూరీ హెడ్, ఇజ్రాయెలీ ఫిల్మ్ మేకర్ నదవ్ లపిడ్ చేసిన కామెంట్లపై దుమారం రేగడంతో ఇండియాకు ఇజ్రాయెల్ సారీ చెప్పింది. గోవాలో 53వ ఇఫీ ఫెస్టివల్ కార్యక్రమం సందర్భంగా సోమవారం నదవ్ లపిడ్ మాట్లాడుతూ.. కాశ్మీర్ ఫైల్స్ చెత్త సినిమా అని కామెంట్ చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలాన్ మంగళవారం స్పందించారు. నదవ్ వ్యాఖ్యలను ఖండించారు. కేంద్రానికి బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పారు. ఇఫీ జడ్జిల ప్యానెల్​కు హెడ్​గా ఇండియా ఇచ్చిన అవకాశాన్ని లపిడ్ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.

‘‘చారిత్రక ఘటనల గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాటిపై వ్యాఖ్యానించడం సరికాదు. మీ వ్యాఖ్యల పట్ల ఇజ్రాయెల్‌‌ దేశస్తుడిగా నేను సిగ్గుపడుతున్నా’’ అని అన్నారు.  ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటున్న రెండు దేశాల సారూప్యాన్ని కూడా లపిడ్ గుర్తించలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. దీనిపై జ్యూరీ బోర్డు కూడా స్పందిస్తూ.. ఆ కామెంట్లు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేసింది. సినిమాలపై బోర్డు ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయబోదని, సభ్యులెవరైనా కామెంట్లు చేస్తే అవి వారి వ్యక్తిగతమని పేర్కొంది. ఈ సినిమాలో నటించిన అనుపమ్ ఖేర్, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కూడా నదవ్ కామెంట్లపై మండిపడ్డారు.