గాజా స్వాధీనం : హమాస్ పార్లమెంట్ లో ఇజ్రాయెల్ సైన్యం

గాజా స్వాధీనం : హమాస్ పార్లమెంట్ లో ఇజ్రాయెల్ సైన్యం

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో కీలక పరిణామం. గాజా సిటీలోని హమాస్ పార్లమెంట్ లో ఇజ్రాయెల్ సైన్యం అయిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.. తమ దేశ జెండాలను ప్రదర్శించటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది ఇజ్రాయెల్. 

40 రోజులుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతుంది. గాజా సిటీ మొత్తాన్ని స్వాధీనం చేసుకునే దిశగా లక్షల మంది ఇజ్రాయెల్ సైన్యం.. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గాజా సిటీలోని హమాస్ పార్లమెంట్ భవనాన్ని స్వాధీనం చేసుకోవటం కీలక పరిణామం. దీంతో ఇక గాజాలో ఇజ్రాయెల్ పాలన ప్రారంభం అయినట్లే చెప్పొచ్చు అంటున్నారు ప్రపంచ దేశాల నిపుణులు. 

ఇదే సమయంలో ఇజ్రాయెల్ సైన్యంతో జరిగిన పోరాటంలో.. హమాస్ కు చెందిన కీలక నేతలు అందరూ చనిపోయినట్లు కూడా ప్రకటించింది ఇజ్రాయెల్. దీంతో ప్రస్తుతం యుద్ధం చేస్తున్న హమాస్ సైన్యానికి దశానిర్దేశం చేసే వారు లేక చెల్లాచెదురు అయినట్లు వార్తలు వస్తున్నాయి. గాజాలోని ఆస్పత్రులను తమ ఆధీనంలోకి తీసుకుని.. సామాన్యులను అడ్డుపెట్టుకుని ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుందంటూ విమర్శలు చేస్తుంది హమాస్. 

ఏది ఏమైనా గాజా సిటీ నడిబొడ్డున హమాస్ కీలక ప్రాంతం అయిన పార్లమెంట్ భవనాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవటం.. అక్కడ ఇజ్రాయెల్ జెండాలు ఎగరేయటం అనేది.. హమాస్ ఓటమిగానే చెప్పొచ్చు. మరికొన్ని రోజుల్లోనే.. గాజా సిటీ మొత్తాన్ని ఇజ్రాయెల్ తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు.

Also read :-గాజాలో అతిపెద్ద ఆస్పత్రి క్లోజ్