- లెబనాన్‌పైనా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్
- హెజ్బొల్లా లక్ష్యంగా ప్రతీకార దాడులు
- లెబనాన్‌లోని కమాండ్ సెంటర్ నేలమట్టం
- ముగ్గురు హెజ్బొల్లా మిలిటెంట్లు మృతి
బీరుట్/జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి దగ్గర్లో హెజ్బొల్లా జరిపిన డ్రోన్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్).. లెబనాన్, గాజాపై ఆదివారం వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఉత్తర గాజాలోని బీట్ లాహియా పట్టణంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో దాదాపు 87 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. మరో 40 మంది గాయపడ్డారు. లెబనాన్ రాజధాని బీరుట్‌లోని హెజ్బొల్లా కమాండ్ సెంటర్‌పై ఐడీఎఫ్ బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ముగ్గురు హెజ్బొల్లా మిలిటెంట్లు మృతి చెందారు.
సౌత్ బీరుట్ లోని మరికొన్ని ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. మసీదు, హాస్పిటల్‌కు దగ్గరలో ఉన్న హారెట్ హ్రీక్ లోని ఓ భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసిందని లెబనాన్ అధికారిక మీడియా నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. సాధారణ పౌరులే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు చేస్తున్నదని మండిపడింది. బీరుట్లో హెజ్బొల్లాకు చెందిన ‘కమాండర్ సెంటర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్’ను నేలమట్టం చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. అండర్ గ్రౌండ్లో దాచిపెట్టిన ఆయుధాలను కూడా ధ్వంసం చేశామని తెలిపింది. ఈ దాడిలో ముగ్గురు హెజ్బొల్లా మిలిటెంట్లు చనిపోయినట్లు చెప్పింది.
175 హమాస్ క్యాంపులు ధ్వంసం..
నిమిషాల వ్యవధిలోనే లెబనాన్ 70 ప్రొజెక్టైల్స్‌ను ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. వాటిలో కొన్నింటిని ధ్వంసం చేయగా.. మరికొన్నింటిని ఐరన్ డోమ్‌తో అడ్డుకున్నట్లు చెప్పింది. కాగా, ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 87 మంది పాలస్తీనియన్లు చనిపోయారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. రెసిడెన్షియల్ ఏరియాలోని ఓ బిల్డింగ్‌పై వైమానిక దాడిజరిగింది. పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు గాయపడ్డారని వివరించింది. రెసిడెన్షియల్ ఏరియాలపైనే ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నదని ఏజెన్సీ మండిపడింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిపింది. గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ కామెంట్లను ఇజ్రాయెల్ మిలటరీ ఖండించింది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని తెలిపింది. గాజా, లెబనాన్‌లోని 175 హమాస్ క్యాంపులను ధ్వంసం చేశామని ప్రకటించింది. నార్త్, సౌత్, సెంట్రల్ గాజాపైనే ఫోకస్ పెట్టామని తెలిపింది.
ఏడాదిలో 43వేల పాలస్తీనియన్లు మృతి
గతేడాది అక్టోబర్ 7 నుంచి ఇప్పటిదాకా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుమారు 43వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది సాధారణ పౌరులే ఉన్నారు. అందులోనూ మహిళలు, చిన్నారులే అత్యధిక మంది ఉన్నట్లు గాజా హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. సుమారు లక్ష మంది వరకు గాయపడ్డారు. మృతులు, గాయపడినవారు ఇంకా చాలా మందే ఉండొచ్చని గాజా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. గాజా స్ట్రిప్ మొత్తం నామరూపాల్లేకుండా పోయింది. కేవలం 10వేల మంది డెడ్బాడీలనే పూడ్చిపెట్టారు. ఇప్పటికీ ఇంకా చాలా మంది హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఇజ్రాయెల్ ఆర్మీ.. హాస్పిటల్స్, అపార్ట్మెంట్లేలక్ష్యంగా దాడులు చేస్తున్నారని గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. నార్త్ గాజాలోని కమల్ అద్వాన్ హాస్పిటల్‌పై ఆదివారం జరిగిన దాడిలో ఎలక్ట్రిసిటీ గ్రిడ్, వాటర్ ట్యాంకులు ధ్వంసమైనట్లు హాస్పిటల్ డైరెక్టర్లు తెలిపారు. గాయపడిన వారికి సరిగ్గా ట్రీట్మెంట్ అందడం లేదు. నిరుడు అక్టోబర్ 7 నుంచి ఇప్పటిదాకా జెరూసలెం వెస్ట్ బ్యాంక్‌లో 11,300 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ అరెస్ట్ చేసింది. కాగా, ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1,418 మంది చనిపోయినట్లు లెబనాన్ ప్రకటించింది.
ఇరాన్‌పై ఐడీఎఫ్ దాడుల ప్లాన్లు లీక్
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన ప్లాన్లు లీక్ అయ్యాయి. రెండు కీలక ఫైల్స్.. అమెరికా ఇంటెలిజెన్స్ నుంచే బయటికెళ్లినట్లు తెలుస్తున్నది. ఈ రెండు ఫైల్స్‌లోని కీలక విషయాలు ఇరాన్ అనుకూల మీడియా వెల్లడించింది. అక్టోబర్ 1 నాటి దాడికి ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ సైనిక విన్యాసాలు చేసినట్లు ఆ ఫైల్స్ లో ఉంది. ఫైటర్ జెట్లకు ఆకాశంలో ఇంధనం నింపడం, సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లు, ఒకవేళ ఇరాన్ దాడి చేస్తే అడ్డుకునేందుకు క్షిపణుల మోహరింపు వంటి వివరాలు ఒక ఫైల్లో ఉన్నాయి. ఆయుధాలు, ఇతర సైనికపరమైన సామాగ్రి వ్యూహాత్మక స్థానాలకు తరలించడానికి ఇజ్రాయిల్ చేస్తున్న ప్రయత్నాలను రెండో ఫైల్ వెల్లడిస్తున్నది. అక్టోబర్ 15, 16వ తేదీల్లో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ చేసిన సన్నాహాల గురించి కూడా ఇందులో ప్రస్తావించారు.
ఏడాది కిందటి హమాస్ చీఫ్ సిన్వర్ వీడియో రిలీజ్
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేశారు. దీనికి కొన్ని గంటల ముందు హమాస్ మిలిటెంట్ చీఫ్ యాహ్యా సిన్వర్.. తన భార్య, పిల్లలతో గాజాలోని ఓ బంకర్లోకి వెళ్లి దాక్కున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్ తాజాగా విడుదల చేసింది. తన ఫ్యామిలీతో కలిసి యాహ్యా సిన్వర్ బంకర్లో తిరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.
అతని ఇంటి కిందే ఈ సొరంగం ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కువ రోజులు తన ఫ్యామిలీతో ఇదే బంకర్లో సిన్వర్ దాక్కున్నాడు. బంకర్లో కిచెన్, షవర్స్, టాయిలెట్లు ఉన్నాయి. ఫుడ్, క్యాష్, కొన్ని డాక్యుమెంట్లను బంకర్ నుంచి ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్నది. కాగా, వీడియోలో సిన్వర్ భార్య చేతిలో ఓ హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తుంది. దాని విలువ సుమారు రూ.26 లక్షలు ఉంటుందని సమాచారం. కాగా, ఇటీవల ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో సిన్వర్ చనిపోయాడు.