గాజాలో నో సేఫ్ జోన్.. సౌత్ ప్రాంతంపైనా ఇజ్రాయెల్ దాడులు

గాజాలో నో సేఫ్ జోన్.. సౌత్ ప్రాంతంపైనా ఇజ్రాయెల్ దాడులు

గాజా/జెరూసలెం:  హమాస్ మిలిటెంట్ల నరమేధంతో తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ వరుసగా 13వ రోజు కూడా గాజా స్ట్రిప్ పై బాంబుల వర్షం కురిపించింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ పట్టణంలోని పలు టార్గెట్లపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ లు శుక్రవారం బాంబు దాడులు చేశాయి. దీంతో జనమంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. పట్టణంలో అంబులెన్స్ ల సైరన్ మోతలు మోగాయి. ఈ దాడుల్లో ఎంత మంది చనిపోయారు? ఎంత మంది గాయపడ్డారన్న వివరాలు వెల్లడికాలేదు. గాజాలోని దక్షిణాది ప్రాంతాలు సేఫ్ జోన్ లు అని, ప్రజలంతా అక్కడికి వెళ్లాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వారం కిందట ప్రకటించారు. కానీ ఇజ్రాయెల్ ఆర్మీ అధికారి నిర్ దినార్ శుక్రవారం మాట్లాడుతూ.. గాజాలో అసలు సేఫ్ జోన్​లు అన్నవే లేవని స్పష్టంచేశారు. దీంతో గాజా స్ట్రిప్ లో ఎక్కడున్నా బాంబు దాడుల ప్రమాదం తప్పదని చాలా మంది నార్త్​లోని తమ ఇండ్లకు తిరిగి వెళుతున్నారు. 

గ్రౌండ్ అటాక్​కు సైన్యం రెడీ..

గాజాలోకి ఎంటరై హమాస్ మిలిటెంట్లను ఏరివేయాలని భావిస్తున్న ఇజ్రాయెల్ 10 వేల మంది బలగాలతో గ్రౌండ్ అటాక్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా వారం రోజుల నుంచే వార్తలు వచ్చాయి. అయితే, త్వరలోనే గాజాలోకి తమ బలగాలు ఎంటర్ కానున్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ యోవ్ గాలంట్ హింట్ ఇచ్చారు. మిలిటెంట్లలో ప్రతి ఒక్కరినీ ఏరివేయడమే తమ లక్ష్యమని.. ఇందుకు వారం లేదా నెల లేదా నెలలైనా పట్టొచ్చన్నారు. హమాస్​ను అంతం చేశాక పాలస్తీనియన్లను కంట్రోల్ చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. మరోవైపు, హమాస్​పై గ్రౌండ్ అటాక్ చేస్తే  హిజ్బొల్లా మిలిటెంట్లు రాకెట్ దాడులు చేసే అవకాశం ఉండటంతో లెబనాన్ బార్డర్​ సమీపంలోని  టౌన్​ను ఇజ్రాయెల్​  ఖాళీ చేయిస్తోంది.  

గాజాలో 4,137కు పెరిగిన మృతులు 

ఇజ్రాయెల్ దాడుల్లో శుక్రవారం నాటికి 4,137 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు గాజా హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. మొత్తం 12,500 మందికి గాయాలు అయ్యాయని, మరో 1,300 మంది శిథిలాల కింద సమాధి అయి ఉండొచ్చని తెలిపింది. ఇక హమాస్ దాడుల వల్ల ఇజ్రాయెల్ లో 1,400 మంది చనిపోగా, 203 మంది మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్నారు.  

రఫా క్రాసింగ్ వద్దకు గుటెర్రస్ 

గాజాలోకి ఎంటరయ్యేందుకు నిత్యావసరా లతో కూడిన 200 ట్రక్కులు ఇంకా రఫా క్రాసింగ్ వద్దే ఆగాయి. రోడ్లు ధ్వంసం కావడంతో అధికారులు వాటిని రిపేర్ చేస్తున్నారు. శని లేదా ఆదివారం గాజాలోకి ట్రక్కులు ప్రవేశించే అవకాశం ఉంది. కాగా,  యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రస్  శుక్రవారం రఫా క్రాసింగ్ వద్దకు వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు. పాలస్తీని యన్లకు మానవతా సాయం కోసం ఈజిప్ట్, ఇజ్రాయెల్, అమెరికా ఇతర అన్ని వర్గాల తో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు.