గాజా ఆస్పత్రిపై రెయిడ్.. దవాఖానలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ బలగాలు

గాజా ఆస్పత్రిపై రెయిడ్..  దవాఖానలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ బలగాలు

గాజా/జెరూసలెం:   గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ బలగా లు బుధవారం తెల్లవారుజామున రెయిడ్ చేశాయి. దవాఖాన కింద హమాస్ మిలిటెంట్ల కమాండ్ సెంటర్ ఉందంటూ మంగళవారం ఓ టన్నెల్​ను బయటపెట్టిన ఇజ్రాయెల్ బలగాలు బుధవారం ఆ దవాఖానలోకి ప్రవేశించాయి. గాలిలోకి కాల్పులు జరుపుతూ దవాఖానలో ఒక్కో రూంకు వెళ్తూ హమాస్ మిలిటెంట్ల కోసం గాలించాయి. ‘‘16 ఏండ్లకుపైబడి ఉన్న మగవాళ్లంతా చేతులెత్తండి. మా ముందుకు వచ్చి లొంగిపోండి..” అంటూ ఇజ్రాయెల్ సోల్జర్ ఒకరు అరబిక్​లో లౌడ్ స్పీకర్ ద్వారా ప్రకటించాడని అదే ఆస్పత్రిలో తలదాచుకుంటున్న జర్నలిస్ట్ ఒకరు ‘ఏఎఫ్ పీ’  వార్తా సంస్థకు వెల్లడించారు. 

సోల్జర్లు గాలిలోకి కాల్పులు జరుపుతూ రావడంతో ఆస్పత్రిలోని పేషెంట్లు, శరణార్థులు, సిబ్బంది అంతా భయాందోళనకు గురయ్యారని తెలిపారు. అల్ షిఫా ఆస్పత్రిలో ప్రస్తుతం పేషెంట్లు, వారి అటెండెంట్లు, స్టాఫ్, శరణార్థులు సహా మొత్తం 2,300 మంది ఉన్నారని గాజా హాస్పిటల్స్ డైరెక్టర్ వెల్లడించారు. దవాఖానలో ట్రీట్ మెంట్ అందక మంగళవారం మరో 40 మంది పేషెంట్లు చనిపోయారని తెలిపారు. 

ఆస్పత్రి అంతటా కుళ్లిపోతున్న మృతదేహాల కంపు కొడుతోందన్నారు. బయట కాల్పులు కొనసాగుతుండటంతో ఎవరూ బయటకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. హాస్పిటల్ కాంప్లెక్స్ లోకి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు సైతం ప్రవేశించాయని, ఆస్పత్రిలో కనీసం తిండి, నీళ్లు కూడా లేవన్నారు. అయితే, హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకునే ఆస్పత్రిలో గాలింపు చేపట్టామని బుధవారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ప్రకటించింది. 

ఆస్పత్రిలో పసికందులకు అవసరమైన ఇంక్యుబేటర్లు, బేబీ ఫుడ్, మందుల వంటివి అందజేశామని తెలిపింది. మంగళవారం హమాస్ పార్లమెంట్​తో సహా పోలీస్ హెడ్ క్వార్టర్స్​ను స్వాధీనం చేసుకున్నామని, నార్త్ గాజా దాదాపుగా తమ కంట్రోల్​లోకి వచ్చిందని వెల్లడించింది. అయితే, గాజా నుంచి సౌత్ ఇజ్రాయెల్ దిశగా ఇంకా హమాస్ రాకెట్ దాడులు కొనసాగుతున్నాయని పేర్కొంది.

ట్రూడో కామెంట్లకు నెతన్యాహు కౌంటర్

గాజాలో పిల్లలు, మహిళలను చంపడం ఇకనైనా ఆపాలంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. బ్రిటిష్ కొలంబియాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ దాడులను తప్పుపట్టారు. హమాస్ కూడా బందీలను విడిచిపెట్టాలని, ప్రజలను రక్షణ కవచాలుగా వాడుకోవడం మానేయాలని హితవు పలికారు. అయితే, ట్రూడో కామెంట్లపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు.

 గాజాలో పిల్లలు, మహిళల మరణాలకు బాధ్యత వహించాల్సింది ఇజ్రాయెల్ కాదని హమాస్ అని స్పష్టం చేశారు. తాము మానవత్వంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయేందుకు అవకాశం ఇస్తే.. హమాస్ మిలిటెంట్లు మాత్రం వారికి గన్స్ గురిపెట్టి ఎక్కడికీ వెళ్లనివ్వడంలేదని ఆయన ట్వీట్ చేశారు.