
కైరో: గాజా సిటీపై శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ బలగాలు దాడి చేశాయి. ఈ అటాక్లో 34 మంది చనిపోయారు. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారు. పాలస్తీనాను దేశంగా గుర్తించేందుకు పలు దేశాలు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో సోమవారం భేటీ అవుతున్న టైంలో గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసింది. మృతుల డెడ్ బాడీలను షిఫా హాస్పిటల్కు తరలించారు.
చనిపోయిన వారిలో నర్స్ కుటుంబం కూడా ఉందని పాలస్తీనా హెల్త్ ఆఫీసర్లు తెలిపారు. కాగా.. గాజా నుంచి వెళ్లిపోవాలని పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ ఇదివరకే హెచ్చరిక పంపింది. హమాస్ చెరలో బందీలుగా ఉన్న తమ పౌరుల విడుదల కోసమే గాజాపై దాడి చేశామని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. తమ పౌరులను హమాస్ టెర్రరిస్టులు వెంటనే తమకు సరెండర్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
పాలస్తీనాను దేశంగా గుర్తించిన పలు దేశాలు
పాలస్తీనాను పలు దేశాలు దేశంగా గుర్తించాయి. ఈ మేరకు సోమవారం యూఎన్ జనరల్ అసెంబ్లీలో భేటీ కానున్నాయి. పాలస్తీనాకు దేశ హోదా ఇచ్చిన వాటిలో యూకే, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, మాల్టా, బెల్జియం, లంగ్జెంబర్గ్, పోర్చుగల్ తదితర దేశాలు ఉన్నాయి. మరోవైపు, పాలస్తీనాను దేశంగా గుర్తించడాన్ని ఇజ్రాయెల్లో శాంతి కార్యకర్తలు స్వాగతించారు.
అది మంచి నిర్ణయమని కొనియాడారు. ఈ మేరకు శనివారం వేలాది మంది కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. యుద్ధం ముగించేందుకు సమయం ఆసన్నమైందని 60 యూదు, అరబ్ సంఘాలు పేర్కొన్నాయి. హమాస్, ఇజ్రాయెల్ బందీలుగా ఉంచుకున్న వారిని వెంటనే విడుదల చేసి శాంతికి నాంది పలకాలని ఆ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.