కొడుతూ తీస్కెళ్లినా మంచిగనే చూస్కున్నరు

కొడుతూ తీస్కెళ్లినా మంచిగనే చూస్కున్నరు
  • హమాస్ చెర నుంచి విడుదలైన మహిళల వెల్లడి

గాజా: హమాస్ మిలిటెంట్ల చెర నుంచి మరో ఇద్దరు బందీలు విడుదలయ్యారు. సోమవారం రాత్రి ఇజ్రాయెల్​కు చెందిన యోచెవ్డ్ లిఫ్షిజ్ (85), నూరిట్ కూపర్(79) లను మిలిటెంట్లు రెడ్ క్రాస్ సిబ్బందికి అప్పగించారు. అయితే, వారి భర్తలను మాత్రం విడుదల చేయలేదు. ఈ సందర్భంగా లిఫ్షిజ్ మీడియాతో మాట్లాడారు. మిలిటెంట్లు తమను బందీలుగా తీసుకెళ్లినప్పటి నుంచి తాము ఎదుర్కొన్న పరిస్థితులను ఆమె వివరించారు. ‘‘అక్టోబర్ 7న నన్ను, నా భర్తను మిలిటెంట్లు కొడుతూ బైక్​లపై అడ్డంగా పడుకోబెట్టి తీసుకెళ్లారు. నాకు పక్కటెముకలు విరిగినంత పనైంది. ఊపిరి ఆడలేదు. మమ్మల్ని గాజాలో సాలెగూడులా ఉన్న టన్నెళ్లలో బంధించారు. ఆ తర్వాత బాగానే చూసుకున్నారు.

డాక్టర్లను తీసుకు వచ్చి వైద్యం చేయించారు. అయితే, అనారోగ్యంతో బాధపడుతున్నందున మా ఇద్దరిని మాత్రం విడిచిపెట్టారు. మా భర్తలు ఇంకా వారి చెరలోనే ఉన్నారు” అని తెలిపారు. హమాస్ ముప్పును ఇజ్రాయెల్ ఆర్మీ సీరియస్ గా తీసుకోలేదని, ఖరీదైన సెక్యూరిటీ కంచె కూడా మిలిటెంట్లను అడ్డుకోలేకపోయిందని ఆమె పేర్కొన్నారు. అయితే, వీరిని మిలిటెంట్లు రెడ్ క్రాస్ సిబ్బందికి అప్పగిస్తున్న వీడియో వైరల్ అయింది. ఈ సందర్భంగా ఓ మిలిటెంట్​కు లిఫ్షిజ్ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం చర్చనీయాశం అయింది.