
- ఇరాన్ ఆయిల్ ఉత్పత్తి కేంద్రంపైఇజ్రాయెల్ మిసైల్దాడి
- ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ పాక్షికంగా ధ్వంసం
- -షహ్రాన్ చమురు డిపోపైనా బాంబుల వర్షం
- ఇజ్రాయెల్ దాడుల్లో మూడ్రోజుల్లో 400 మంది మృతి
- క్షిపణులు, డ్రోన్లతో టెల్అవీవ్ సిటీపై ఇరాన్ అటాక్
- పదిమంది మృతి.. ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ క్లోజ్
జెరూసలెం: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్–ఇరాన్మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్, అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) దాడులు చేయగా.. ఇరాన్ కూడా తీవ్రస్థాయిలో ప్రతిస్పందించింది.
దీంతో ఇరుదేశాల మధ్య భీకర దాడులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తన ఎయిర్ స్పేస్‌ను క్లోజ్ చేసింది. ఇరాన్ మినిస్ట్రీ ఆఫ్ హెడ్‌క్వార్టర్స్‌తోపాటు టెహ్రాన్‌లోని అణు కార్యక్రమాల ప్రాజెక్టులను ఐడీఎఫ్ దళాలు లక్ష్యంగా చేసుకొని ఎయిర్‌స్ట్రైక్స్ చేశాయి. ఎస్పీఎన్డీ న్యూక్లియర్ ప్రాజెక్టుపై బాంబుల వర్షం కురిపించాయి. కాగా, టెహ్రాన్‌లోని షహ్రాన్ చమురు డిపోను ఐడీఎఫ్ లక్ష్యంగా చేసుకుందని ఇరాన్ తెలిపింది.
ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన సౌత్ పార్స్పైనా మిసైల్ దాడులు జరిపిందని ఆరోపించింది. దీంతో ఉత్పత్తిని పాక్షికంగా నిలిపివేశామని ఇరాన్ పేర్కొంది. ఇరాన్‌లోని హౌసింగ్ కాంప్లెక్స్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 29 మంది చిన్నారులు సహా 60 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు 78 మంది మృతిచెందారని, 320 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌లో 10 మంది మృతి
ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతిదాడికి దిగింది. శనివారం (june 14) రాత్రి, ఆదివారం (june 15) తెల్లవారుజామున టెల్అవీవ్ లక్ష్యంగా వందలాది డ్రోన్లు, మిసైల్స్‌తో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూనే.. ప్రతిదాడులు చేసింది. దీంతో జెరూసలెం, టెల్ అవీవ్‌లో అంతటా వైమానిక దాడి సైరన్లు మోగాయి. ప్రజలు సురక్షిత ప్రదేశాలకు పరుగులు పెట్టారు.
ఇజ్రాయెల్ ఇంధన మౌలిక సదుపాయాలను, ఫైటర్ జెట్ ఇంధన ఉత్పత్తి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. ఇరాన్ దాడుల్లో కనీసం 10 మంది మరణించారని ఇజ్రాయెల్‌కు చెందిన మాగెన్ డేవిడ్ అడోమ్ రెస్క్యూ సర్వీస్ తెలిపింది. 180 మంది గాయపడ్డారని, ఏడుగురి ఆచూకీ తెలియడంలేదని వెల్లడించింది. టెల్అవీవ్ సమీప బాటమ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై మిసైల్దూసుకురాగా.. 9,10 ఏండ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతిచెందారు.
ఉత్తర ఇజ్రాయెల్‌లోని అరబ్ పట్టణం తామ్రాలో ఒక భవనంపై క్షిపణి దాడిలో ఐదుగురు మరణించగా, 24 మంది గాయపడ్డారు. సెంట్రల్ సిటీ అయిన రెహోవోట్‌పై జరిగిన దాడిలో 42 మంది గాయపడ్డారు. దీంతో ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 13కు చేరుకుంది. దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం, వైమానిక ప్రాంతాన్ని మూడోరోజు కూడా ఇజ్రాయెల్మూసేసింది.
దొంగచాటుగా డ్రోన్లను చేరవేసి..
ఇజ్రాయెల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడికి చాలా ముందు నుంచే మొస్సాద్ ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. మొసాద్ ఏజెంట్లు డ్రోన్లను దొంగతనంగా ఇరాన్‌లోకి తరలించి కీలక ప్రాంతాల్లో దాచారు. ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు మొదలుపెట్టగానే ఇరాన్‌లోని మొసాద్ఏజెంట్లు కూడా రంగంలోకి దిగి డ్రోన్లను ప్రయోగించారు. పేలుడు పదార్థాలు అమర్చిన డ్రోన్లతో టెహ్రాన్‌లోని ఎయిర్‌బేస్‌పై దాడి చేశారు.
సెంట్రల్ ఇరాన్లో మొస్సాద్ కమాండో యూనిట్లు కూడా రంగంలోకి దిగాయి. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలపై ప్రెసిషన్ గైడెడ్ వెపన్లతో దాడులు చేశాయి. ఇజ్రాయెల్‌కు అవరోధంగా భావిస్తున్న ఇరాన్ ఎయిర్ మిసైల్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడంపై ఫోకస్ చేసి, ఐడీఎఫ్ దాడులకు అడ్డు తొలగించడంలో మొస్సాద్ ఏజెంట్లు సక్సెస్ అయ్యారు.
ఆత్మరక్షణ కోసమే ప్రతిదాడి చేస్తున్నం: ఇరాన్
తాము ఇజ్రాయెల్‌పై ఆత్మరక్షణ కోసమే ప్రతిదాడి చేస్తున్నామని ఇరాన్ తెలిపింది. తమపై ఇజ్రాయెల్సైనిక చర్యను నిలిపేస్తే.. తాము కూడా దాడులు ఆపేస్తామని ప్రకటించింది. ఈమేరకు ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాక్చీ వెల్లడించారు. పరిస్థితి చేయిదాటితే తప్ప ఇజ్రాయెల్‌తో వివాదాన్ని పొరుగుదేశాలకు విస్తరించాలని ఇరాన్ కోరుకోవడంలేదన్నారు. తమ దేశంలోని ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన సౌత్ పార్స్‌పై ఇజ్రాయెల్ దాడి ఓ దురాక్రమణ, ప్రమాదకర చర్య అని మండిపడ్డారు.
యుద్ధాన్ని విస్తరించే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందన్నారు. ఇరాన్‌లోని అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ రెడ్ లైన్ దాటిందని అన్నారు. ఇజ్రాయెల్ దాడులకు అమెరికా మద్దతిస్తోందని ఆరోపించారు. ఇందులో అమెరికా ప్రమేయంలేకుంటే ఇజ్రాయెల్ దాడులను బహిరంగంగా ఖండించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ దాడులపై యునైటెడ్ నేషన్స్(యూఎన్) కూడా ఉదాసీనత చూపిస్తున్నదని అన్నారు.
అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన ఇజ్రాయెల్‌ను ఏమీ అనకుండా.. వెస్ట్రన్ కంట్రీలన్నీ ఇరాన్‌ను తప్పుబడుతున్నాయని అన్నారు. మరోవైపు, ఇరాన్ అణ్వాయుధాలు తయారుచేస్తే తమకు ముప్పు ఉందని, దానిని అడ్డుకునేందుకే అణు స్థావరాలపై దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ వాదిస్తున్నది.
ఇండియన్స్‌కు అడ్వైజరీ
ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఇరాన్‌లోని ఇండియన్స్‌కు అక్కడి భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ఎవరూ భయాందోళనకు గురికావొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. టెహ్రాన్‌లోని ఇండియన్ఎంబసీతో టచ్‌లో ఉండాలని పేర్కొన్నది. తమ సోషల్ మీడియా అకౌంట్స్‌ను ఫాలో కావాలని తెలిపింది. అలాగే, గూగుల్ ఫాంలో ఇండియన్స్ తమ వివరాలను నమోదు చేయాలని సూచించింది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఓ టెలిగ్రామ్ లింక్‌ను కూడా షేర్ చేసింది. హెల్ప్లైన్నంబర్లను ఏర్పాటు చేసింది.