
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. శాంతి బహుమతికి ట్రంప్ పేరును పరిశీలించాల్సిందిగా నోబెల్ కమిటీకి లేఖ పంపానని చెప్పారు. సోమవారం (జులై 08) వైట్ హౌస్ లో డిన్నర్ కు ముందుగా ట్రంప్ తో కలిసి నెతన్యాహు మీడియాతో మాట్లాడారు.
తాను రాసిన లేఖ ప్రతిని మీడియా ముందే ట్రంప్ కు అందజేశారు. ‘‘ట్రంప్ శాంతి కోసం విశేష కృషి చేస్తున్నారు. ఒక దాని వెంట ఒకటిగా యుద్ధాలను ఆపుతున్నారు” అని కొనియాడారు. ఇంతకుముందు ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తూ లేఖను పంపినట్టు పాకిస్తాన్ కూడా ప్రకటించింది.
అయితే, తాను ఇండియా, పాకిస్తాన్ మధ్య, సెర్బియా, కొసావో మధ్య యుద్ధాలను ఆపానని.. అయినా నోబెల్ అవార్డు వస్తుందో రాదోనంటూ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల ఇరాన్ అణు కేంద్రాలపై విజయవంతంగా దాడులు చేసిన నేపథ్యంలో నెతన్యాహు అమెరికా పర్యటనకు వచ్చారు. గాజాలో కాల్పుల విరమణ కోసం హమాస్‌తో ఇజ్రాయెల్ ఒప్పందాన్ని కుదుర్చుకునే అంశంపైనా
వీరు చర్చించుకునే అవకాశాలు ఉన్నాయి.