గాజా టన్నెళ్లలో ఇజ్రాయెల్​ వేట

 గాజా టన్నెళ్లలో  ఇజ్రాయెల్​ వేట
  • గాజా టన్నెళ్లలో  ఇజ్రాయెల్​ వేట 
  • స్పాంజ్ బాంబులతో వాటిని మూసివేసే ప్రయత్నాలు
  • వరుసగా రెండో రోజూ కొనసాగిన గ్రౌండ్ అటాక్స్
  • గాజాలో మృతుల సంఖ్య 7 వేలు


గాజా/జెరూసలెం: గాజాలోకి అడుగుపెట్టి గ్రౌండ్ అటాక్స్ చేస్తూ హమాస్ మిలిటెంట్లను వేటాడేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా వరుసగా రెండోరోజూ గాజా సిటీ శివార్లలో స్వల్పంగా దాడులు చేసింది. బుధవారం రాత్రి నార్త్ గాజా వద్దకు యుద్ధట్యాంకులతో వెళ్లి దాడులు చేసి వచ్చిన ఐడీఎఫ్ సోల్జర్లు గురువారం రాత్రి సౌత్ గాజా శివార్లకు వెళ్లి హమాస్ స్థావరాలను, రాకెట్ లాంచింగ్ సైట్లను ధ్వంసం చేసి వచ్చారు. ఈ రెండు రెయిడ్స్ లో తమ బలగాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఐడీఎఫ్ ప్రకటించింది. గాజా సిటీ కింద అండర్ గ్రౌండ్ లో 80 మీటర్ల లోతులో వందలాది కిలోమీటర్ల సాలెగూడులా హమాస్ టన్నెల్స్ ఉన్నాయి. ఇందులోకి నేరుగా వెళ్లి మిలిటెంట్లను దాడి చేసేందుకు వీలు కాకపోవడంతో గ్రౌండ్ అటాక్​కు ముందుగా అడ్డంకులను తొలగించుకోవాలని ఐడీఎఫ్ భావిస్తోంది. ఇందులో భాగంగానే రాత్రిపూట దాడులు చేస్తోంది. అలాగే బంకర్లు, స్టోర్ రూంలు, ట్రాప్​లతో కూడిన టన్నెల్స్​లో మిలిటెంట్ల ఏరివేతకు ప్రత్యేక టీంలను, పరికరాలను సిద్ధం చేస్తోంది. టన్నెల్స్​ను గుర్తించిన వెంటనే వాటిని మూసివేసేందుకు ప్రత్యేకంగా స్పాంజ్ బాంబులనూ ఇజ్రాయెల్ సిద్ధం చేసుకున్నట్లుగా చెప్తున్నారు. స్పాంజ్ బాంబులో.. ఒక ప్లాస్టిక్ బాక్స్​లో ఐరన్ షీట్​తో వేరుచేసి ఉంచిన రెండు కెమికల్స్ ఉంటాయి. వీటిని టన్నెల్ లోపలికి పంపి పేల్చేయగానే రెండు కెమికల్స్ కలిసి రియాక్షన్ జరిగి పెద్ద ఎత్తున నురగ ఏర్పడుతుంది. ఈ నురగ వెంటనే గట్టిపడిపోయి టన్నెల్ 
ద్వారం పూర్తిగా మూతపడుతుంది.

7 వేలు దాటిన మరణాలు

గాజాపై ఇజ్రాయెల్ దాడులతో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 7 వేలు దాటింది. గత ఇరవై రోజుల్లో ఐడీఎఫ్ చేసిన దాడుల వల్ల 7,326 మంది చనిపోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ శుక్రవారం వెల్లడించింది. వీరిలో 3,038 మంది పిల్లలే ఉన్నారని తెలిపింది. అయితే, బాంబు దాడుల్లో ధ్వంసమైన భవనాల శిథిలాల కింద మరో 1000 మంది వరకూ సమాధి అయి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) పేర్కొంది. అలాగే వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ దాడుల్లో మరో 100 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఇక హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ లో 1,400 మంది చనిపోగా, 220కిపైగా మంది మిలిటెంట్ల చెరలో బందీలుగా ఉన్నారు. ఇజ్రాయెల్ బాండు దాడుల వల్ల బందీల్లో 50 మంది చనిపోయారని హమాస్ ప్రకటించింది. కాగా, ఇజ్రాయెల్ లోని 6 వేల మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేస్తే గాజాలోని బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ సిద్ధంగా ఉందని గురువారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇరాన్ ఫారిన్ మినిస్టర్ హుస్సేన్ అమిరబ్దుల్లా వెల్లడించారు.

సిరియాలో అమెరికా దాడులు 

వాషింగ్టన్: ఈస్టర్న్ సిరియాలోని రెండు ప్రాంతాల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తో సంబంధం ఉన్న స్థావరాలపై శుక్రవారం ఉదయం తమ యుద్ధవిమానాలతో బాంబుదాడులు చేసినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ దాడులకు హమాస్, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇటీవల ఇరాక్, సిరియాలోని అమెరికా స్థావరాలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే తాము ఈ అటాక్స్ చేశామని పేర్కొంది.