SSLV-D3: ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం.. ఇస్రోలో సంబరాలు

SSLV-D3: ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం.. ఇస్రోలో సంబరాలు

నెల్లూరు: శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఎస్ఎస్ఎల్వీ-డీ3 నింగిలోకి దూసుకెళ్లింది. ఈవోఎస్-08 శాటిలైట్ను ఎస్ఎస్ఎల్వీ-డీ3 మోసుకెళ్లింది. షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. మైక్రో శాటిలైట్ల అభివృద్ధి, భవిష్యత్ ఉపగ్రహాల తయారీ లక్ష్యంతో ఇస్రో ఈ ప్రయోగం చేసింది. చిన్న చిన్న శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపేందుకు తయారు చేసిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ)ను ఇస్రో మూడోసారి ప్రయోగించింది. ఎస్ఎస్ఎల్వీడీ3 రాకెట్ ద్వారా ఇస్రోకు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్(ఈవోఎస్)08, స్పేస్ రిక్షా అనే స్టార్టప్ సంస్థ రూపొందించిన ఎస్ఆర్0 డెమో శాట్ అనే నానో శాటిలైట్ అంతరిక్షానికి చేరనున్నాయి.

ఎస్ఎస్ఎల్వీని ఇస్రో తొలిసారిగా 2022లో ప్రయోగించగా ఆ మిషన్ ఫెయిల్ అయింది. రెండోసారి 2023 ఫిబ్రవరి 10న చేపట్టిన మిషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు మూడోసారి చేపట్టిన ఈ ప్రయోగంలో 175 కిలోల బరువు ఉన్న ఈవోఎస్08 ద్వారా ఏకంగా 21 కొత్త టెక్నాలజీలను పరీక్షించాలని ఇస్రో టార్గెట్గా పెట్టుకున్నది. అంతరిక్షంలో సూర్యుడి నుంచి వచ్చే కాంతిలో ఎంత మొత్తంలో యూవీ లైట్ శాటిలైట్పై పడుతుందనేది కచ్చితంగా తెలుసుకునేందుకు ఈవోఎస్08లో సరికొత్త పరికరాన్ని అమర్చారు. ఈ పరికరం సమర్థంగా పని చేస్తే.. గగన్ యాన్ మిషన్ లోనూ దీనిని వినియోగించడం ద్వారా వ్యోమగాములను యూవీ లైట్ నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇక స్పేస్ రిక్షా సంస్థ తయారు చేసిన డెమో శాట్ కేవలం అర కిలో బరువు మాత్రమే ఉంటుంది.

ఎస్ఎస్ఎల్వీ రాకెట్ కేవలం 34 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు,120 టన్నుల బరువు మాత్రమే ఉంటుంది. 500 కిలోలలోపు ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ (350-400 కి.మీ.)కు తీసుకెళ్లగలదు. ఒక్కో రాకెట్ ను జస్ట్ రూ. 30 నుంచి 35 కోట్లకే తయారు చేయొచ్చు. ప్రపంచ మార్కెట్ లో చిన్న రాకెట్ల తయారీలో ఇదే అత్యంత చీప్ అండ్ బెస్ట్ రాకెట్ కానుంది. తయారీ, జోడింపు, స్టోరేజ్ వంటివి చాలా ఈజీ. ప్రైవేట్ కంపెనీల ఉపగ్రహాల ప్రయోగాలకు వీటిని ఈజీగా, స్పీడ్గా తయారుచేసి అందించవచ్చు. అవసరమైతే దీనిని మిసైల్ మాదిరిగా కూడా వాడుకోవచ్చు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నందుకే ఇది చిన్న రాకెట్ ప్రయోగాల మార్కెట్లో ఇస్రోకు అత్యంత కీలకంగా మారనుంది.