ఇస్రో మరో ప్రయోగం...నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-56

ఇస్రో మరో ప్రయోగం...నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-56

ఇస్రో మరో ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది.  పీఎస్ఎల్వీ సీ56 రాకెట్ ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది.  ఆంధ్రప్రదేశ్‌లోని  శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ-సీ56 (PSLV-C56) వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను నింగిలో నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ రాకెట్ లో డీఎస్‌ ఎస్‌ఏఆర్‌ (DS SAR) ఉపగ్రహంతోపాటు నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీకి చెంచిన వెలాక్స్‌-ఏఎం, ఆర్కేట్‌, స్కూబ్‌-2, న్యూలియాన్‌, గెలాసియా-2, ఓఆర్‌బీ-12 శాటిలైట్‌లు ఉన్నాయి. ఇస్రోకు ఇది 90వ స్పేస్ మిషన్. జులై 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు ఈ పీఎస్ఎల్వీని ప్రయోగించారు. షార్ లోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగాన్ని చేపట్టారు. పీఎస్ఎల్వీ వాహక నౌకకు సంబంధించి ఈ ఏడాది ఇది రెండో ప్రయోగం కావడం విశేషం.  మొత్తం మీద పీఎస్ఎల్వీ సిరీస్ లో 58వ మిషన్.

 పీఎస్ఎల్వీ సీ56 రాకెట్ ప్రయోగం విజయవంతమయిన తర్వాత శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందించారు.  ప్రయోగం విజయవంతం అయిందని, రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించామని ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్  చెప్పారు. సెప్టెంబర్ లో మరో పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. 

పీఎస్ఎల్వీ సీ56 రాకెట్ 44.4 మీటర్ల పొడవు, 228 టన్నుల బరువు ఉంది. ఈ రాకెట్ ఉప్రగహాలను 535 కిలోమీటర్ల ఎత్తులోని ఎర్త్‌ ఆర్బిట్‌లో విడిచిపెడుతుంది. తొలుత ఈ ప్రయోగాన్ని జూలై 26నే చేయాలనుకున్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో జులై 30వ తేదీ ప్రయోగించారు