చంద్రుడిపై మట్టి, రాళ్లు: 2040లో చంద్రయాన్​-4

చంద్రుడిపై మట్టి, రాళ్లు: 2040లో చంద్రయాన్​-4

చంద్రయాన్​ –3 ప్రయోగంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్​ ల్యాండర్ను దించిన ఇస్రో కీలక విషయాలను రాబట్టింది. ఆ సమాచారంతో చంద్రయాన్​ 4ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లు, మట్టిని భూమిపైకి తీసుకువచ్చి, వాటి ద్వారా మరిన్ని విషయాలు రాబట్టాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు చంద్రయాన్​ 4ను ప్రయోగించనుంది. 

    
14 రోజులపాటు (ఒక లూనార్​ డే అంటే భూమిపై 14 రోజులకు సమానం) చంద్రుడిపై చంద్రయాన్​ 4 పరిశోధనలు జరిపి తిరిగి 14 రోజుల తర్వాత భూమికి చేరుకుంటుందని ఇస్రో అధికారులు వెల్లడించారు. చంద్రుడిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. పగలు సమయంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దాదాపు 127 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా. రాత్రి సమయాల్లో 14 రోజులపాటు గడ్డకట్టుకుపోయే చలి ఉంటుందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పగలు సమయంలోనే చంద్రయాన్​ 4ను ల్యాండ్​ చేయనున్నారు. ఈ యాత్రను 2040లో చేపట్టాలని ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇప్పటికే చెప్పింది. 

చంద్రుడిపైన ఉన్న రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి వాటిని మరింత విశ్లేషించేందుకు భూమిపైకి తీసుకురావడమే చంద్రయాన్​ 4 ప్రాథమిక లక్ష్యం. ఒకవేళ చంద్రయాన్​ 4 విజయవంతమై తిరిగి భూమిపైకి వస్తే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనున్నది. ఇక చంద్రుడిపై చంద్రయాన్​ 3 ల్యాండ్​అయిన శివశక్తి పాయింట్​కు దగ్గరలోనే చంద్రయాన్​ 4 కూడా ల్యాండ్​ కానున్నది.