
భారత సైనిక నిఘా సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం వచ్చే ఐదేండ్లలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 52 నిఘా ఉపగ్రహాలను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్, అథరైజేషన్ సెంటర్(ఇన్ స్పేస్) చైర్మన్ పవన్ కుమార్ గోయెంకా తెలిపారు. శత్రువుల కదలికలను పసిగట్టేందుకు, సరిహద్దులను పర్యవేక్షించేందుకు, సైనిక కార్యకలాపాల సమయంలో సమన్వయాన్ని మెరుగుపర్చేందుకు త్రివిధ దళాలకు సాయపడనున్నాయి.
అంతరిక్ష ఆధారిత నిఘా వ్యవస్థ విషయంలో భారత్ ఇప్పటికే బలమైన సామర్థ్యాలు కలిగి ఉన్నదని, దానిని నిరంతరం మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కుమార్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఇస్రో రానున్న ఐదేళ్లలో 52 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని, ఇందులో సగం ప్రైవేట్ రంగం ద్వారా సమకూరుతాయని ఇన్ స్పేస్ చైర్మన్ పవన్ కుమార్ గోయెంకా తెలిపారు.