చందమామపై ఆక్సిజన్.. గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్

చందమామపై  ఆక్సిజన్.. గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్
  • సల్ఫర్, అల్యూమినియం, కాల్షియం, ఐరన్ మూలకాలూ గుర్తింపు  
  • హైడ్రోజన్ కోసం కొనసాగుతున్న అన్వేషణ
  • ఇయ్యాల్టితో 7 రోజులు పూర్తి 

బెంగళూరు:  చందమామ దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ ఆనవాళ్లను ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళవారం ప్రకటించింది. అక్కడి మట్టిలో సల్ఫర్, అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్ మూలకాలూ ఉన్నట్టు రోవర్ లోని లిబ్స్ (లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపీ) పరికరం తేల్చిందని వెల్లడించింది. ప్రస్తుతం హైడ్రోజన్​ను గుర్తించేందుకు రోవర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తోందని తెలిపింది. 

చంద్రుడి దక్షిణ ధ్రువంపై నేరుగా మట్టిని, అందులోని మూలకాలను విశ్లేషించడం ఇదే తొలిసారి అని ఇస్రో పేర్కొంది. చంద్రుడి మట్టిపైకి లేజర్ కాంతి పుంజాలను ప్రయోగించడం ద్వారా మట్టిలోని మూలకాలను, వాటి స్థాయిలను లిబ్స్ పరికరం విశ్లేషించిందని తెలిపింది. ఆయా మూలకాల స్థాయిలను వివరించే గ్రాఫ్​ను కూడా ఇస్రో ట్విట్టర్​లో పోస్ట్ చేసింది. ఇప్పటివరకు చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్​లలోనూ అనేక పరికరాలు ఉన్నా.. వాటితో నేలపై ఉన్న మూలకాలను గుర్తించడం సాధ్యం కాలేదని వివరించింది. 


చందమామపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ బుధవారం నాటితో 7 రోజులు పూర్తి చేసుకోనున్నాయి. చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా ఇప్పటివరకు ల్యాండర్, రోవర్ పలు కీలక పరిశోధనలు చేపట్టాయి. జాబిల్లి దక్షిణ ధ్రువంపై నేలలో టెంపరేచర్ల తేడాలను తొలిసారిగా విక్రమ్ ల్యాండర్ లోని చాస్ట్ పరికరం ప్రపంచానికి తెలియజేసింది. భారీ గుంత అడ్డురావడంతో ప్రజ్ఞాన్ రోవర్ తన రూట్ మార్చుకుని సేఫ్ గా ప్రయాణించిన అద్భుత ఘటన కూడా ఆసక్తి రేకెత్తించింది. ప్రస్తుతం ల్యాండర్, రోవర్ బాగానే పని చేస్తున్నాయని, ఇవి రెండూ పరిశోధనల్లో బిజీగా ఉన్నాయని ఇస్రో పేర్కొంది. 

 ఇవి మరో ఏడు రోజుల పాటు చంద్రుడిపై భూకంపాలు, ఖనిజాల శాతం, ఉపరితలంపై వాటర్ ఐస్ ఆనవాళ్లపై స్టడీ చేయనున్నాయని వెల్లడించింది. అయితే, చంద్రుడిపై 7 రోజులు పగలు (ఒక లూనార్ డే), 7 రోజులు రాత్రి (ఒక లూనార్ నైట్) ఉంటాయి. మన భూమితో పోలిస్తే ఒక లూనార్ డేకు14 రోజులు పడుతుంది. విక్రమ్, ప్రజ్ఞాన్ ఉన్న చోట మరో 7 రోజుల్లో రాత్రి ప్రారంభం కానుంది. దీంతో వీటి మిషన్ లైఫ్ అప్పుడే ముగిసిపోనుంది. మళ్లీ లూనార్ డే వచ్చిన తర్వాత ఇవి పని చేస్తాయో, లేదో మాత్రం చెప్పలేమని సైంటిస్టులు పేర్కొంటున్నారు.