ఈ సారి సేఫ్ ల్యాండింగ్ పక్కా.. చంద్రయాన్​–3​పై సైంటిస్టుల ధీమా

ఈ సారి సేఫ్ ల్యాండింగ్ పక్కా.. చంద్రయాన్​–3​పై సైంటిస్టుల ధీమా
  • చంద్రయాన్​–3​పై ఇస్రో సైంటిస్టుల ధీమా 
  • చంద్రయాన్–2 ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు 
  • ఏ సమస్య వచ్చినా మిషన్ సక్సెస్ అయ్యేలా మార్పులు
  • రేపు సాయంత్రమే చంద్రుడిపై విక్రమ్ ల్యాండింగ్ 
  • ప్రాసెస్ అంతా సాఫీగా సాగుతోందన్న ఇస్రో

న్యూఢిల్లీ/బెంగళూరు: చందమామపై మన ల్యాండర్ ఈ సారి కచ్చితంగా సేఫ్​ గానే దిగుతుందని ఇస్రో సైంటిస్టులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ల్యాండింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా అధిగమించేలా ఈ సారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వారు చెప్తున్నారు. చంద్రయాన్ 2 ఫెయిల్యూర్  తర్వాత లోపాలను సరిద్దుకుని చంద్రయాన్ 3 ప్రాజెక్టు చేపట్టామని ఇస్రో చైర్మన్, డిపార్ట్ మెంట్  ఆఫ్  స్పేస్  సెక్రటరీ డాక్టర్  ఎస్.సోమనాథ్  తెలిపారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో అంతా సాఫీగానే సాగుతోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర సైన్స్ అండ్  టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్  జితేంద్ర సింగ్ ను సోమనాథ్  సోమవారం కలిశారు.

చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్  గురించి మంత్రికి వివరించారు. ప్రాజెక్టులో సిస్టమ్స్  అన్నీ సజావుగా పని చేస్తున్నాయని, డౌట్ అవసరం లేదని ఆయన చెప్పారు. ఈ మిషన్ లో పాలు పంచుకున్న ఇండియన్  ఇన్ స్టిట్యూట్  ఆఫ్​ సైన్స్  (ఐఐఎస్) బెంగళూరు ఏరోస్పేస్  సైంటిస్ట్  రాధాకాంత్  కూడా సేఫ్ ల్యాండింగ్ పై ధీమా వ్యక్తం చేశారు. విక్రమ్ సేఫ్ ల్యాండింగ్  విషయంలో సందేహమే అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఓ టీవీ చానెల్ తో ఆయన  మాట్లాడారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని చంద్రయాన్ 3 మిషన్   చేపట్టామని చెప్పారు. ఇస్రో మాజీ చైర్మన్, చంద్రయాన్ 2 ఇన్ చార్జి కె.శివన్  కూడా ఈ సారి ల్యాండర్  సక్సెస్  అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

జాగ్రత్తగా ఉండాలి: మాధవన్ నాయర్

విక్రమ్  ల్యాండర్  సేఫ్  ల్యాండింగ్  చాలా కష్టమని, సేఫ్ ల్యాండ్  విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇస్రో మాజీ చైర్మన్  మాధవన్  నాయర్  అన్నారు. మిషన్  విజయవంతం కావాలంటే సిస్టమ్స్  అన్నీ సరిగ్గా పని చేసేలా చూసుకోవాలని, ఏమాత్రం పొరపాటు జరిగినా ల్యాండింగ్  ఫెయిల్  అవుతుందని ఆయన హెచ్చరించారు. చంద్రయాన్ 2 సేఫ్ ల్యాండింగ్ ను త్రుటిలో మిస్  అయ్యామన్నారు. సోమవారం ఓ టీవీ చానెల్ తో ఆయన మాట్లాడారు.  ‘‘చంద్రయాన్ 2లో ఎదురైన లోపాలను అధిగమించి చంద్రయాన్ 3 ప్రాజెక్టు చేపట్టినా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యానికి ఏమాత్రం తావు ఇవ్వరాదు” అని నాయర్  పేర్కొన్నారు.

చంద్రయాన్ 3లో చేసిన మార్పులు ఇవే..

చంద్రయాన్ 2 మిషన్ లోపాలను సరిదిద్దుకుని చంద్రయాన్ 3 మిషన్ లో ఇస్రో అనేక మార్పులు చేర్పులు చేసింది. విక్రమ్  ల్యాండర్ లో ఏవైనా సమస్యలు వచ్చినా సేఫ్ గా ల్యాండ్ అయ్యేలా సాల్వేజ్ మోడ్ లో డిజైన్ చేశారు. నిర్మాణం పటిష్టంగా ఉండేలా ఆరు ‘సిగ్మా బౌండ్స్’ పద్ధతిని అనుసరించారు. చంద్రయాన్ 2లో ల్యాండర్  వేగం కంట్రోల్  చేసుకోలేకపోయింది. అందువల్లే చంద్రుడి ఉపరితలంపై కూలిపోయింది. ఆ ప్రాజెక్టులో అల్గారిథమ్  ఫెయిల్యూర్  జరిగింది. ప్రస్తుతం ఆ లోపాలను ఇస్రో సైంటిస్టులు సరిదిద్దారు. అంతేకాకుండా చంద్రయాన్ 3 విక్రమ్  ల్యాండర్  కాళ్లను కూడా చాలా బలంగా తయారు చేశారు.

చంద్రయాన్ 2లో ఎదురైన లోపాలు, ఫెయిల్యూర్స్ ను దృష్టిలో పెట్టుకొని చంద్రయాన్ 3 ప్రాజెక్టు చేపట్టారు. సురక్షితమైన ల్యాండింగ్  ప్రదేశాన్ని కనుగొని, ల్యాండ్  అయ్యేటట్లు విక్రమ్  ల్యాండర్ ను తీర్చిదిద్దారు. చంద్రయాన్ 2లో ఒకే ఆన్ బోర్డ్  కంప్యూటర్  ఉండగా.. విక్రమ్  ల్యాండర్ లో రెండు ఆన్ బోర్డ్  కంప్యూటర్లు ఫిక్స్  చేశారు. అలాగే ఒత్తిడిని తట్టుకునేలా ల్యాండర్ ను తయారు చేశారు. సేఫ్  అండ్  సాఫ్ట్ ల్యాండింగ్  జరిగేలా అత్యాధునిక టెక్నాలజీతో విక్రమ్  ల్యాండర్ ను అభివృద్ధి చేశారు. వైబ్రేషన్లను తట్టుకునేలా పక్కాగా టెస్ట్ చేసి మిషన్ చేపట్టారు.