
వెలుగుల జాబిలిని చంద్రయాన్2 ఆర్బిటర్ క్లిక్‌మనిపించింది. కొద్ది రోజుల క్రితం చీకటి చంద్రుడిని కెమెరా లెన్సుల్లో దాచిన ఆర్బిటర్.. ఇప్పుడు తొలిసారి సూర్యుడి కాంతితో వెలిగిపోతున్న జాబిలిని ఒడిసి పట్టింది. ఆర్బిటర్‌లోని ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ (ఐఐఆర్‌ఎస్) ఆ ఫొటోలను తీసింది. జాబిలిపై ఉన్న పాత, కొత్త లోయలను చూపించింది. చందమామపై పడిన సూర్యుడి కాంతిని లెక్కగట్టింది. సూర్యుడి కాంతి పరావర్తన (రిఫ్లెక్షన్) లెక్కల ఆధారంగా చంద్రుడిలోని ఖనిజాలు, మూలకాలను గుర్తించడానికి వీలుగా ఐఐఆర్ఎస్ను ఆర్బిటర్‌లో పెట్టి పంపింది ఇస్రో. ఇప్పటికే తెలిసిన సోమర్ఫీల్డ్, స్టెబిన్స్, కర్క్వుడ్ లోయలతో పాటు ఆ లోయల్లోనే ఏర్పడిన కొన్ని కొత్త లోయలనూ ఐఐఆర్‌ఎస్ గుర్తించింది.