ఇస్రో  ప్రయోగంలో చిన్న సాంకేతిక సమస్య

ఇస్రో  ప్రయోగంలో  చిన్న సాంకేతిక సమస్య

తిరుపతి: ఇస్రో  ప్రయోగించిన SSLV - డీ1లో  సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం 9 గంటల 18 నిమిషాలకు నింగిలోకి SSLV - D1 ను పంపారు సైంటిస్టులు. ప్రయోగం సక్సెస్ అయిందని ఇస్రో అధికారులు తెలిపారు. అయితే చిన్న సాంకేతిక లోపం వచ్చిందని చెప్పారు. టెర్మినల్ కు సంబంధించిన సమాచారం రావడానికి ఆలస్యమైందని ఇస్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాకెట్ గమనాన్ని విశ్లేషిస్తున్నామని..ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేరాయో లేదో పరిశీలించాలన్నారు. ప్రయోగ పురోగతిపై త్వరలోనే సమాచారం ఇస్తామని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ చెప్పారు. 

మూడో దశ తర్వాత ఈవోఎస్‌-2, ఆజాదీ ఉపగ్రహాలను రాకెట్‌ వదిలింది. సాంకేతిక లోపం కారణంగా ఉపగ్రహాల నుంచి కంట్రోల్‌ సెంటర్‌కు సిగ్నల్‌ అందడం లేదని శాస్త్తవేత్తలు తెలిపారు. మూడు దశల ప్ర​‍యోగాలు పూర్తయ్యాయని.. నాలుగో దశలో సాంకేతిక సమస్య తలెత్తిందన్నారు. తుది దశ సమాచార సేకరణలో కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. చిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్ ‌(ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1) ను ఇస్రో రూపొందించింది. తిరుపతి జిల్లా సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ఇది నింగిలోకి దూసుకెళ్లింది.